దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరలు వింటుంటే మధ్యతరగతి వర్గీయులకే కాదు సంపన్నులకూ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఫలితంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.1.20 లక్షలకు చేరింది.
హైదరాబాద్ బులియన్ విపణిలో 999 స్వచ్ఛత కలిగిన మేలిమి (24 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బిస్కెట్ ధర మంగళవారం రాత్రి రూ.12,00,000కు చేరింది. అంటే 10 గ్రాముల మేలిమి బంగారమే రూ.1.20 లక్షలు అన్నమాట. కిలో వెండి ధర కూడా రూ.1,47,500 వద్ద ఉంది.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 3845 డాలర్లకు మించడం, వెండి ఔన్సు ధర 46.52 డాలర్లకు చేరడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా డాలర్ విలువ ఎన్నడూ లేని గరిష్ఠస్థాయి రూ.88.80కి చేరడం.. దేశీయంగా దిగుమతి సుంకం, జీఎస్టి కలిపి 9 శాతానికి పైగా జతకలుస్తున్నందున ఈ లోహాల ధరలు అంతర్జాతీయ విపణితో పోలిస్తే, మనదగ్గర మరింత అధికంగా ఉంటున్నాయి.
పైగా, అమెరికాలో వడ్డీరేట్లను ఈ నెలలో తగ్గించడానికి తోడు, ఈ ఏడాదిలో మరిన్ని కోతలుంటాయనే దిశగా ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. ఫలితంగా బాండ్లపై ప్రతిఫలాలు తగ్గుతున్నాయి. వర్ధమాన దేశాల్లో ఈక్విటీ మార్కెట్లు అంత ఆకర్షణీయంగా లేనందున పాశ్చాత్య మదుపర్లు తమ పెట్టుబడులను ఈ లోహాలపైకి మళ్లించడమే తాజా పరిస్థితికి కారణమని బులియన్ వర్గాలు వివరిస్తున్నాయి.