ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వోద్యోగులను వారి సాధారణ పదవీకాలం పూర్తికాకుండా బదిలీ చేయటానికి వీల్లేదని, అందుకు తగిన కారణాలు పేర్కొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఓ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిలీవ్ చేసిన విషయం గుర్తించామని, దీనికి తమ అనుమతి లేదని వెల్లడించారు. ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ప్రభుత్వానికి సూచించారు.
ఒకవేళ బదిలీ చేస్తే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే నుంచి 243జెడ్‌ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగించేలా చేస్తామని వివరించారు. ఈ మేరకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసులు సహా ఎన్నికల సంఘం తరఫున బాధ్యతలు నిర్వర్తించే ఎవర్ని బదిలీ చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఆదేశాల్లో ఆయన ఉటంకించారు.
ముందస్తు అనుమతి తీసుకోవాలి
ప్రధాన ఎన్నికల అధికారులు, సంయుక్త సీఈవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రాలు తమ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ జనవరి 15న భారత ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.వారు ఎన్నికల సంఘం తరఫున బాధ్యతల నిర్వహణ పూర్తిచేసుకున్న తర్వాత ఏడాది వరకూ ఈ నిబంధన వర్తిస్తుందని అందులో వివరించింది.
స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సవాళ్లను ఎదుర్కొంటోంది. వివిధ విభాగాల అధికారులు తాత్కాలికంగా ఎన్నికల కమిషన్‌కు సేవలందిస్తున్నారు. వీరిలో ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఇతర యూనిట్ అధికారులు, రిటర్నింగ్/ సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.
వీరి హక్కుల్ని కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఉంటాయి అని రమేశ్ కుమార్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. లక్ష్మణరేఖ దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవిలో ఉన్న ఒకరు ఇటీవల బెదిరించిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు కమిషన్ దృష్టికి తెచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల భయాందోళనలను తొలగించి విశ్వాసాన్ని నింపేందుకు వీలుగా వారి రక్షణ కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని కమిషన్ భావించింది అని రమేశ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు, పోలీసుల్ని అభినందిస్తున్నామన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోండి
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని రమేశ్‌కుమార్ కోరారు. తొలిదశ ఎన్నికలు మంగళవారం జరగనున్న నేపథ్యంలో మీడియాకు వీడియో సందేశాన్ని పంపించారు.
ఈనెల 9, 13, 17, 21 తేదీల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో, పూర్తి భద్రత మధ్య ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అన్నారు.