ప్రభుత్వ పథకాల అమలులో యునిసెఫ్ అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం అందించాలని ఆయన కోరారు.
యునిసెఫ్- ఏపీ గవర్నమెంట్ జాయింట్ ఏన్యూవల్ రిఫ్లక్సన్ మీటింగ్... సీఎస్ అధ్యక్షతన జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన కార్యాలయంలో జరిగింది. ముందుగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో యునిసెఫ్ పాత్ర ను వివరించారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాబోయే ఏడాదిలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది చేపట్టిన పథకాల్లో అభివృద్ధిని యునిసెఫ్ ప్రతినిధులు వివరించారు. 2021-22 సంవత్సరంలో లక్ష్యాలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వివరించారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించినా... ఏపీలో నిర్వఘ్నంగా చేపట్టిన సంక్షేమ పథకాలపై యునిసెఫ్ ప్రతినిధులు ప్రశంసలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ యునిసెఫ్ సాయంపై శాఖల వారీగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ, గతేడాది కరోనా కాలంలో తీవ్రమైన ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ కింద పథకాలను అమలు చేసి, పేదలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
ముఖ్యంగా ఆరోగ్యం, విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పేదలకు, బాలింతలకు, చిన్నారులకు, గర్భిణుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో యునిసెఫ్ అందిస్తున్న సాయం మరువలేనిదన్నారు.
భవిష్యత్తులోనూ ఇదే సాయం అందించాలని ఆశిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో యునిసెఫ్ ప్రతినిధులు, ముఖ్య కార్యదర్శులు బి.రాజశేఖర్, ఉదయలక్ష్మి, రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.