Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరు పేదలకు అందుబాటులో ప్రత్యేక వైద్య సేవలు: ఎపి గవర్నర్

నిరు పేదలకు అందుబాటులో ప్రత్యేక వైద్య సేవలు: ఎపి గవర్నర్
, గురువారం, 26 నవంబరు 2020 (08:13 IST)
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిరుపేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వేతర సంస్ధలు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. తిరుపతిలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలను రాజ్ భవన్ నుంచి గవర్నర్ ఆన్ లైన్ విధానంలో  ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ సేవలు, ఆధునిక వైద్య పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులోకి రావటం వల్ల తిరుపతి, రాయలసీమ ప్రాంత ప్రజలు ఉన్నత స్థాయి వైద్య సంరక్షణను పొందగలుగుతారన్నారు.
 
విజ్ఞాన్‌ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఒడిస్సాలో చాలా సంవత్సరాలుగా వైద్య విద్య విషయంలో మంచి కృషి చేస్తోందని, వారు ఇప్పుడు కంచి కామ కోటి పీతం, సాయి ఫౌండేషన్‌తో కలిసి శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజీని ప్రారంభించటం ముదావహమని గవర్నర్ హరిచందన్ అన్నారు. 
 
విజ్ఞాన్‌ భారతి ఛారిటబుల్ ట్రస్ట్  సిఇఓ, హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి ప్రాణిగ్రాహీని ప్రత్యేకంగా  అభినందించిన గవర్నర్ సమాజంలోని పేద వర్గాలకు సరసమైన ధరలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ధేశించారు. 
 
ఒడిశాలోని పేద ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచటం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ , కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవటం వంటి విషయాలలో  విజ్ఞాన్‌భారతి ఛారిటబుల్ ట్రస్ట్,సాయి ఫౌండేషన్ ప్రశంసలు అందుకున్నాయని హరిచందన్ ప్రస్తుతించారు. 
  
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అస్తవ్యస్తమైన పరిస్థితిని సృష్టించిందని, మానవజాతికి లొంగని సవాలుగా పరిణమించిందని, భయంకరమైన వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి వైద్యులు సోదరభావంతో అవిశ్రాంత కృషి చేసారని ఆయన ప్రశంసించారు. ఇప్పటికీ కరోనా వైరస్ ముప్పుగానే ఉందని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, తిరుపతి లోని వైద్య కళాశాల నుండి శ్రీకాళహస్తి శాసన సభ్యులు బి. మధుసూదన్ రెడ్డి, విబిసిటి సిఇఓ, హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి ప్రాణి గ్రాహి, ఎస్.బి.ఎం.సి.హెచ్ చైర్మన్ సాయి ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య విమానాశ్రయం పేరు 'శ్రీరామ్'