ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే సెప్టెంబరు నాటికి జీనోమ్ వ్యాలీ నుంచి కరోనా వ్యాక్సిన్ వస్తుందని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీలోని ఔషధ సంస్థలు, కరోనాకు ఔషధాన్ని తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయని, వారి కృషి ఫలిస్తే, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో కరోనా వాక్సిన్ తెలంగాణ నుంచే వస్తుందని, దేశంతో పాటు ప్రపంచానికి కూడా మన తెలంగాణ గర్వకారణంగా నిలుస్తందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, రాష్ట్రానికి చెందిన 'బయోలాజికల్ ఈ' నుంచి మహిమా దాట్ల, 'శాంతా బయోటెక్' ఎండీ వర ప్రసాద రెడ్డి ఇటీవల తనతో మాట్లాడారని, వారంతా చాలా సీరియస్‌గా వాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారని గుర్తుచేశారు. వారు అనుకున్నట్టు పరిశోధలు పూర్తయితే ఆగస్టుకే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
లేకపోతే, సెప్టెంబరులో మరో వాక్సిన్ వస్తుందని, ఈ విషయంలో తాము వందకు వంద శాతం విజయవంతం అవుతామని చెప్పారు. అదే జరిగితే, మన రాష్ట్రం నుంచి, జీనోమ్ వ్యాలీ నుంచి వాక్సిన్ రావడం చాలా గ్రేట్ అని అభివర్ణించారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తందన్నారు.
కాగా, తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునేందుకు వీలుగా లాక్‌డౌన్‌ను మే 29వ తేదీ వరకు పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పగలంతా అన్ని షాపులు తెరిచివుంచుతారనీ, రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆ సమయంలో రోడ్లపై తిరిగితే కఠిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.