Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలోనూ మద్యం ధరల బాదుడు... రెడ్ జోన్లలో కూడా విక్రయాలు

తెలంగాణాలోనూ మద్యం ధరల బాదుడు... రెడ్ జోన్లలో కూడా విక్రయాలు
, బుధవారం, 6 మే 2020 (08:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం షాపులు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అదేసమయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను 75 శాతం పెంచారు. దీంతో తెలంగాణ సర్కారు కూడా మద్యం ధరలను పెంచేసింది. దీంతో తెలంగాణాలో కూడా భారీగా మద్యం ధరలను పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పేదలకు ఇబ్బంది కలగకుండా చూడాలని భావించి, సరాసరిన 16 శాతం వరకూ ధరలు పెంచినట్టు తెలిపారు. 
 
అంటే, పేదలు తాగే చీప్ లిక్కరుపై 11 శాతం ధరలను పెంచామని, ధనవంతులు కొనుగోలు చేసే బ్రాండ్లపై 16 శాతం వరకూ ధరల పెరుగుదల ఉంటుందని, లాక్‌డౌన్ తర్వాత పెంచిన ధరలను తిరిగి తగ్గించేది లేదని స్పష్టంచేశారు. ధరల పెంపుపైనా అన్ని వర్గాలతో సమీక్ష జరిపామని వెల్లడించారు. కాగా, పెంచిన ధరల ప్రకారం, రూ.90గా ఉండే క్వార్టర్ లిక్కర్ బాటిల్ ధర రూ.100 కానుండగా, రూ.130 ఉండే బాటిల్ ధర రూ.150కి పెరగనుంది. 
 
అదేసమయంలో బుధవారం 10 గంటల నుంచి మద్యం దుకాణాలను తెరుస్తారని తెలిపారు. ఇవి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని వెల్లడించారు. షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని, కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి గల కారణాలను కూడా సీఎం కేసీఆర్ వివరించారు. కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే మద్యం షాపులను తిరిగి ప్రారంభించడం తనకు ఇష్టం లేదని, అయినా తప్పని పరిస్థితిని పొరుగు రాష్ట్రాలు కల్పించాయన్నారు. 
 
కేంద్రం నిర్ణయాల మేరకు సోమవారం నుంచి తెలంగాణకు సరిహద్దులను కలిగివున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్ తో 890 కిలోమీటర్లు, మహారాష్ట్రతో సుమారు 700 కిలోమీటర్లు, కర్ణాటకతో 496 కిలోమీటర్లు, చత్తీస్‌గఢ్‌తో 235 కిలోమీటర్ల సరిహద్దు ఉందన్నారు. 
 
ఈ సమయంలో తెలంగాణలో షాపులను తెరవకుంటే, లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోతుందని, సరిహద్దు గ్రామాల ప్రజలు నిన్న, మంగళవారమే సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారని, ఈ కారణంతో కరోనా వైరస్ మహమ్మారి తిరిగి వ్యాపించకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కట్టడికి ఏకైక ఆయుధం లాక్‌డౌన్.. అందుకే మే 29 వరకు.. సీఎం కేసీఆర్