Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో ఆ 3 జిల్లాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి అధికం, ఏం చేద్దాం? కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో ఆ 3 జిల్లాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి అధికం, ఏం చేద్దాం? కేసీఆర్ సమీక్ష
, మంగళవారం, 5 మే 2020 (12:52 IST)
కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు.
 
కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని వారు సిఎంను కోరారు.
 
మిగతా జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయని, అక్కడ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందని వివరించారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎనిమిది గంటల పాటు సాగిన సమీక్షలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. 
 
సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సిఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు. ‘‘తెలంగాణలో ఇప్పటివరకు 1085 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. వారిలో 585 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారు. 29 మంది మరణించారు. 471 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
వైరస్ వ్యాప్తి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ ఉంది. మొత్తం 1085 పాజిటివ్ కేసుల్లో 717 మంది (66.08 శాతం) ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే. మరణించిన వారిలో కూడా 82.21 శాతం మంది ఈ జిల్లాల వారే. గడిచిన 10 రోజుల్లో నమోదైన కేసుల్లో కూడా అత్యధిక శాతం మంది ఈ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. 
 
జనసాంద్రత ఎక్కువున్న ప్రాంతం కావడం వల్ల ఏమాత్రం పట్టు వదిలినా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ నాలుగు జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దు. లాక్ డౌన్‌ను యధావిధిగా, అవసరమైతే మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. 
 
మిగతా జిల్లాల్లో పరిస్థితి చాలా మెరుగైంది. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది. ఆ జిల్లాల్లో రెడ్ జోన్లు ఆరెంజు జోన్లుగా, ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి’’ అని వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
 
వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ లోనే లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా? వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? తదితర అంశాలను చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల డొల్లతనం.. బొప్పాయి పండుకు పాజిటివ్