విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తెలుగుదేశం సీనియర్ నేత కాట్రగడ్డ బాబు విరాళం అందించారు. విధి నిర్వహణలో పలువురు పోలీసు సిబ్బంది సైతం కరోనా బారిన పడుతుండగా, వారి కుటుంబాలను ఆదుకునే క్రమంలో కాట్రగడ్డ లక్ష రూపాయలను పోలీసు శాఖకు అందించారు.
విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ పోలీసు కమీషనరేట్ పరిపాలనా విభాగాపు డీసీపీ మేరీ ప్రశాంతికి లక్ష రూపాయల చెక్‌ను కాట్రగడ్డ బాబు అందచేశారు. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్న క్రమంలో వ్యక్తిగతంగా కాట్రగడ్డ లక్ష రూపాయలను పోలీసుల సంక్షేమం కోసం సమకూర్చటం చిన్న విషయం కాదని ఈ సందర్భంగా పోలీసు వర్గాలు అభిప్రాయపడ్డాయి.
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడే యోధులుగా పోలీసులు పని చేస్తున్నందున తనవంతు బాద్యతగా వారికి ఆర్ధిక సాయం చేసినట్లు బాబు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని కాట్రగడ్డ పేర్కొన్నారు.