తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో బుధవారం నుంచి ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని సడలింపులు ఇచ్చారు. మద్యం షాపులు కూడా తెరిచేందుకు ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణాలో అన్ని సంస్థలు, కార్యాలయాలు పని చేయనున్నాయి.
అయితే, తెలంగాణాలో మూడు జిల్లాలు మాత్రం అత్యంత ప్రమాదకారిగా మారినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అలాగే, తెలంగాణాలో నమోదైన మొత్తం 1096 కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఏకంగా 726 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జోన్లలోనే 25 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందువల్ల ఈ మూడు జోన్లతో పాటు.. మూడు జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు.