గంజాయి వ్యవహారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలం ఎట్టకేలకు పోలీసులు రికార్డు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు అందించగా, వాటిని తీసుకునేందుకు ఆనంద్ బాబు ససేమిరా అన్నారు. దీనితో పెద్ద ప్రహసనమే నడిచింది.
ఏపీలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలాన్ని పోలీసులు ఎట్టకేలకు నేడు నమోదు చేసుకున్నారు. ఓ ప్రెస్ మీట్ లో నక్కా ఆనంద్ బాబు గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి, గత అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు నిరాకరించారు. దాంతో పోలీసులు ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మాజీ మంత్రినని, తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా? పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమా? అని నిలదీశారు. అయినా పట్టువీడని పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని సేకరించారు.