పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, తీవ్రవాద సంస్థ అల్ ఖైదాతో కలిసి భారీ ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఈశాన్య రాష్ట్రమైన అసోంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలు, సైనిక స్థావరాలు, మతపరమైన స్థలాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత శనివారం గౌహతి పోలీస్ కమిషనర్ అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసి, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత నెలలో దరాంగ్ జిల్లాలో హింసాత్మక సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు ముస్లిం యువకులు మరణించగా.. 11 మంది పోలీసులతో సహా 20 మంది గాయపడ్డారు.
ఈ క్రమంలోనే దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లోనూ బాంబు దాడులకు పాల్పడవచ్చని, లేదంటే ఐఈడీలతో పేలుళ్లు, బస్‌స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లోనూ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.