Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజాస్వామ్యానికి మూలగ్రంథం మన రాజ్యాంగం: హైకోర్టు సీజే

Advertiesment
ప్రజాస్వామ్యానికి మూలగ్రంథం మన రాజ్యాంగం: హైకోర్టు సీజే
, సోమవారం, 27 జనవరి 2020 (07:58 IST)
భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి పిలుపునిచ్చారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ముందు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ జి.కె.మహేశ్వరి మాట్లాడుతూ  భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్ధాలు గడిచాయన్నారు. 71వ గణతంత్ర దినోత్సవంగా నేడు మనం జరుపుకుంటున్న పండగ వెనక ఎందరో మహనీయుల త్యాగాలున్నాయని వెల్లడించారు. 

ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగమని అది అమల్లోకి వచ్చిన రోజు నేడు అని తెలిపారు. భారత ప్రజలు, మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించిందని, ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగమని దానిని గుర్తుచేసుకుంటే నిర్వహించుకునే పండగే గణతంత్ర దినోత్సవమని  పేర్కొన్నారు.

భారత దేశానికి సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పలువురు కృషి చేశారని కొనియాడారు.

భారత ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అందుకు కారణం  స్వాతంత్ర్యానికి ముందు సమరయోధులు, స్వాతంత్ర్యానంతరం దేశ సరిహద్దుల్లో జవానులు ఇలా ప్రతి ఒక్కరూ విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వర్తించడమే కారణమని తెలిపారు. అదే విధంగా మనమంతా సక్రమంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

మార్పు మన నుండే మొదలవ్వాలని సూచించారు. రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పించిందని, వాటిని సక్రమంగా వాడుకోవాలని తెలిపారు. ఐక్యంగా ఉంటూ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని సూచించారు. 
 
కార్యక్రమంలో ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైవీ రవిప్రసాద్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఘంటారామారావు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు. 
 
చీఫ్ జస్టిస్ టార్చ్ బేరర్ లాంటి వారని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైవీ రవిప్రసాద్ కొనియాడారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. లోక్‌ అదాలత్‌లో 900 కేసులు సత్వరమే పరిష్కారమయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు.  కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. 
 
బార్  కౌన్సిల్ ఛైర్మన్ ఘంటా రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా గణతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన గణతంత్ర దినోత్సవం భారతజాతి యావత్తు గర్వించాల్సిన  సుదినంగా పేర్కొన్నారు. దీనికి కృషి చేసిన దేశభక్తులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
 
అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం ఆనందంగా  జరుపుకోవాల్సిన రోజని తెలిపారు.  ఆనాటి మేధావుల కృషి ఫలితంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, గొప్ప నిర్ణయాల వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందన్న విషయం గుర్తుచేశారు.
 
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ ఛైర్మన్, సభ్యులు, అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ సొలిసిటర్ జనరల్, అడ్వకేట్ అసోసియేషన్స్, గవర్నమెంట్ ప్లీడర్లు, కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, హైకోర్టు స్టాఫ్ తో పాటు న్యాయమూర్తుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం: ప్రభుత్వ సలహాదారు సజ్జల