ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే, దాన్ని నిట్టనిలువునా ఖూనీ చేసేలా, ప్రజా వ్యతిరేకచర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభంగా చెప్పుకునే ప్రసారమాధ్యమాలను భయపెట్టేలా బ్లాక్‌మెయిలింగ్ చర్యలకు పాల్పడుతోందని, ఆ క్రమంలోనే జీవో-2430ని తీసుకొచ్చిందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
శనివారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పత్రికలు ప్రచురించే మంచిని, చెడుని ఒకేరకంగా సమదృష్టితో చూడాల్సిన పాలకులే నియంతృత్వపోకడలకు పోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేని దుస్థితికి దిగజారిందని ఆలపాటి తెలిపారు.
పాలకుల నిర్ణయాలు, వైఖరి చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జన్సీ నడుస్తోందనేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. తమకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడంలేదన్న ఆలోచనతో ప్రజలు, వారితరుపున ప్రసారమాధ్యమాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో ఏంచేయాలో పాలుపోని గుడ్డిప్రభుత్వం జీవో -2430 పేరుతో మీడియాపై కత్తిదూసిందన్నారు.
మేము చెప్పిందే వేదం, మా శాసనాలే శిరోధార్యమన్నట్లుగా వైసీపీప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రమంత్రులు పాడిందేపాటరా ... పాచిపళ్లదాసుడా అన్నట్లుగా ఒకటేపాట పాడుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కాక రాష్ట్రంలో 600 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పదిమందికి పైగా భవననిర్మాణ కార్మికులు తనువుచాలించారని, వీటన్నింటిపై స్పందించే ధైర్యం ఆపార్టీనేతలకు లేదన్నారు.
గతంలో అధికారంలో ఉన్నవారిపై సాక్షి మీడియాలో వచ్చిన అడ్డగోలు రాతలు, అసత్య కథనాలపై చర్యలు తీసుకోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, తమను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 వంటి పత్రికా సంస్థలపై కక్షసాధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం కాదా అని ఆలపాటి ప్రశ్నించారు.
ఇసుక కృత్రిమ కొరతతో కార్మికుల ఆకలిచావులకు కారణమైన ప్రభుత్వం, దానిపై ప్రశ్నించేవారిపై కత్తికట్టిందన్నారు. తూతూమంత్రంగా అమలుచేసిన రైతుభరోసా, వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగం, అరకొరగాఇస్తున్న ఫించన్లు, మూసేసిన అన్న క్యాంటీన్లు, నిలిచిపోయిన పేదలగృహనిర్మాణాల గురించి రాష్ట్రప్రజానీకం తమను నిలదీస్తుందన్న భయంతోనే ప్రభుత్వపెద్దలు మీడియాను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పూనుకున్నారని టీడీపీనేత పేర్కొన్నారు.
టీడీపీ అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభుత్వాధికారులందరూ ప్రజలకు బాధ్యులుగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తే, వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వాధికారులను పావులుగా వాడుకుంటూ, ప్రజావ్యతిరేక చర్యల్లో వారిని భాగస్వాముల ను చేస్తోందని ఆలపాటి దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చింది మొదలు పాలనపేరుతో తమకు నచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్న ప్రభుత్వం, ప్రశ్నించేవారిని మాత్రం అణగదొక్కు తోందన్నారు. ప్రజలను, ప్రసారమాధ్యమాలను పిల్లిగా భావించిన ప్రభుత్వం తలబిరుసు తన అహంతో జీవో 2430ని తీసుకొచ్చి వారిని పులులుగా మార్చిందని మాజీమంత్రి చెప్పారు.
ఆ జీవోని రద్దు చేసేవరకు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు, పత్రికా యాజమాన్యాలు, ఇతర పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ మడమ తిప్పకుండా నిరంకుశ వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతుందని ఆలపాటి స్పష్టంచేశారు.