Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంటిలేటర్‌పైకి రాష్ట్ర ఆర్థికవ్యవస్థ.. పీఏసీ ఛైర్మన్‌

వెంటిలేటర్‌పైకి రాష్ట్ర ఆర్థికవ్యవస్థ.. పీఏసీ ఛైర్మన్‌
, బుధవారం, 23 అక్టోబరు 2019 (20:25 IST)
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఖరి చూస్తుంటే, ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని, తమ ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గతప్రభుత్వంపై, మాజీముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని, పీఏసీ ఛైర్మన్‌, టీడీపీ సీనియర్‌నేత, ఆ పార్టీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్‌ ఎద్దేవాచేశారు.

బుధవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థికపరిస్థితిపై అవగాహనలేని రాష్ట్ర ఆర్థికమంత్రి, రాష్ట్రాన్ని ఎలా నడపాలో చేతగాక వైసీపీ ప్రభుత్వతీరుతో చేతులెత్తేసిన ఆర్థికసంస్థల నుంచి రూపాయికూడా రాబట్టుకోవడం చేతగాక, చంద్రబాబునాయుడి పాలనపై దుమ్మెత్తి పోస్తున్నాడని కేశవ్‌ మండిపడ్డారు.

గతప్రభుత్వంలో ఐదేళ్లల్లో జీడీపీలో రెండంకెల వృద్ధిరేటు సాధించిన రాష్ట్రంగా దేశంలోనే ఏపీ నిలిచిందని, అది వైసీపీమంత్రికి తప్పుగా కనిపిస్తోందా అని టీడీపీఎమ్యెల్యే ప్రశ్నిం చారు. విభజనానంతరం కట్టుబట్టలతో వచ్చి బస్సులో కూర్చొని పరిపాలన చేస్తూనే,   రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలు సేకరించి, ఒకవైపు అమరావతిని నిర్మించుకుం టూ, రూ.16వేలకోట్ల లోటుడ్జెట్‌తో మొదలై, 2019నాటికి రూ.2లక్షల27వేల కోట్లకు  రాష్ట్ర బడ్జెట్‌ని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుది కాదా అని పయ్యావుల నిలదీశారు.

టీడీపీ పాలనలో దేశంలోనే ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ నెం-1గా ఉంటే, ఇప్పుడు మీ నిర్వాకం కారణంగా, నెం-10లో నిలిచిందన్నారు. బిల్లులు పెండిం గ్‌లో ఉన్నాయని, గతప్రభుత్వం అప్పులుతమపై వేసిందని సన్నాయినొక్కులు నొక్కుతున్న  బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుంటే మంచిదన్నారు.

గత 20ఏళ్ల రాష్ట్ర చరిత్రను మంత్రి ఒక్కసారి పరిశీలించాలని, ఏరోజైనా, ఏ ప్రభుత్వమైనా చివరిఏడాది బిల్లులు పెండింగ్‌లో పెట్టకుండా ముందుకు పోయిందో, లేదో తెలుసుకోవాలని కేశవ్‌  సూచించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమైనా, మరోప్రభుత్వమైనా చివరిఏడాది బిల్లుల్ని ఆ తరువాతి సంవత్సరంలో చెల్లించడమనేది సర్వసాధారణంగా జరిగేదేననే విషయం ఆర్థికమంత్రికి తెలియకపోవడం విచారకరమన్నారు.

టీడీపీ ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతంచేసి అప్పగిస్తే, ఇప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థని వెంటిలేటర్‌పైకి చేర్చిందని పయ్యావుల మండిపడ్డారు. సామాన్య, మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి ప్రజల బతుకులు చిధ్రమై, పనుల్లేక ఆకలికేకలు వేసే దుస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిం దన్నారు. రాష్ట్ర ఖజానాను స్తంభింపచేసిన వైసీపీ పాలనలో రాబోయేరోజుల్లో ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉండనుందన్నారు.

సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ని లాక్‌చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బిల్లులన్నీ నిలిచిపోయాయన్నారు. బ్యాంకర్స్‌ మీటింగ్‌లో గతప్రభుత్వం అప్పులు మేమెందుకు చెల్లించాలని వైసీపీనేతలంటే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా  మీకు అప్పులెందుకు ఇవ్వాలని బ్యాంకర్లు వారినే ప్రశ్నిస్తున్నారని పయ్యావుల దుయ్యబట్టారు.

రాజధాని నిర్మాణానికి నయాపైసా ఖర్చులేకుండా ఆర్థికసంస్థలు, బ్యాంకులతో కలిసి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌గా తన వ్యూహరచనతో చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారన్నారు. వైసీపీ ప్రభుత్వం డబ్బుల్లేవంటూ, అమరావతిని చంపేసిందన్నారు.

ప్రభుత్వాలనేని అప్పులు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళతాయన్న కేశవ్‌, టీడీపీ హయాంలో ఏడాదికి రూ. 22వేలకోట్ల అప్పులుచేస్తే, జగన్మోహన్‌రెడ్డి వచ్చాక, కేవలం 3నెలల్లోనే రూ.18వేలకోట్లు అప్పుచేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచుకుందామనే ఆలోచన తప్ప, రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలను తీసుకొద్దామనే ఆలోచనేలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు 600 కిలోమీటర్ల దూరంవరకు పరిగెడుతున్నారని  పయ్యావుల దెప్పిపొడిచారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని స్థితిలో వైసీపీ ఉంటే, నాడు కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాడన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ను, ఉపాధికూలీలను వేధిస్తున్న రాష్ట్రప్రభుత్వం, నేటివరకు ఏప్రాజెక్ట్‌ పనిచేసింది లేదని, ఎక్కడా గంపెడు మట్టి తీయడంకానీ, తట్ట కాంక్రీట్‌వేయడం గానీ చేయలేదని కేశవ్‌ స్పష్టంచేశారు. ఖర్చులు ఆపేసి, ఖజానాను కాపాడుతున్నామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు, పరోక్షంగా ఖజానా కుంటుపడే పరిస్థితిని కల్పించారన్నారు.

అభివృద్ధి పనులన్నీ నిలిపేసి, రాష్ట్ర ఆర్థికరంగాన్ని కుదేలయ్యేలా చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పటికైనా ఖజానా తాళం తీయాలని పీఏసీ ఛైర్మన్‌ హితవుపలికారు. కుటుంబపాలనకు, ప్రజాపాలనకు మధ్య ఉన్నతేడాను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలని, ప్రభుత్వం ఖర్చులు చేస్తేనే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పనులు దొరుకుతాయని, తద్వారా ఆర్థికరంగం మెరుగుపడుతుందని పయ్యావుల సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆత్మ బహుళమైనది.. శత్రువులంటూ లేరు : ప్రణబ్ ముఖర్జీ