బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మంగళవారం చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు. బుధ, గురువారాల్లో కూడా కోస్తా, ఉత్తారాంద్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
రాయలసీమలో వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి. ప్రజలు వాగులు, నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. పలుచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ హెచ్చరించింది.
భారీ వర్షాల నేపధ్యంలో అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రానున్న మూడు రోజులపాటు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టరు ఎ.ఎండి. ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు.
తుఫాను పరిస్థితి పై తీసుకోవలసిన చర్యల పై స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం అధికారులతో కలెక్టరు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాలలో గంటకు 45 నుండి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా మత్స్యకారులు ఎ వరూ సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లకుండా ఉండేలా తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులను అప్రమత్తం చేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలలో భోజన, వసతి సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తుఫాను పరిస్థితి పై ప్రజలకు సమాచారం అందించేందుకు మరియు ప్రజల సహాయార్ధం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరు కార్యాలయం మరియు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మచిలీపట్నంలోనికి కలెక్టరు కార్యాలయం కంట్రోల్ రూం ఫోన్ నెం. 08672-252752, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఫోన్ నెం. 08672-252486, విజయవాడ సబ్-కలెక్టరు కార్యాలయం లో కంట్రోల్ రూం ఫోన్ నెం . 0866-2574454 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆయా ప్రాంతాల ప్రజలు తుఫాను పరిస్థితిని, పునరావాస కార్యక్రమాలను తెలుసుకొనుటకు మరియు తమ సమస్యలను తెలియజేసేందుకు పైన తెలిపిన కంట్రోల్ రూం ఫోన్ చేయవచ్చని కలెక్టరు తెలిపారు.