Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ? ఎందుకు జరుపుకొంటారు?

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ? ఎందుకు జరుపుకొంటారు?
, మంగళవారం, 26 నవంబరు 2019 (13:09 IST)
1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

26 నవంబర్ న రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ఏటేటా ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకొంటారన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి
 
ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకే రెండేళ్లకు పైనే సమయం పట్టింది. 
 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న.
 
రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం 'జనగణమన'ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. 
 
ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాఫీసుల్లో నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలలో మహిళపై కారం స్ప్రే చల్లిన ఆందోళనకారులు