తన సోదరుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ సంఖ్యాపరంగా ఓడిపోయేందేగానీ, నైతికంగా మాత్రం కాదని ఆ పార్టీ నరసాపురం అభ్యర్థి, సినీ నటుడు నాగబాబు అన్నారు. నా ఛానల్ .. నా ఇష్టం పేరుతో ఆయన ఓ ట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నారు.
ఇందులో ఆయన తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల మేనిఫెస్టోల రూపంలో ఇచ్చిన హామీలను ఆయన నిలబెట్టుకోవాలని సూచన చేశారు. ప్రజలకు మంచి చేసే విషయంలో తమ మద్దతు ఎల్లవేళలా జగన్‍కు ఉంటుందని ఆయన చెప్పారు.
ఇకపోతే, ఈ ఎన్నికల్లో జనసేన ఓడిపోవడంపై ఆయన స్పందిస్తూ, జనసేన పార్టీ సంఖ్యాపరంగానే ఓడిపోయిందేగానీ నైతికంగా మాత్రం కాదన్నారు. తాము క్లీన్ పాలిటిక్స్ పేరుతో రాజకీయాల్లోకి వచ్చామని, అలాంటి తమకు లక్షల ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు.
మార్పును కోరుకునే ప్రతి ఒక్కరూ తమ పార్టీకి ఓట్లు వేశారని, వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఇకపోతే, ప్రజా సమస్యల పోరాటంలో జనసేన పార్టీ ఎపుడూ ముందు ఉంటుందని నాగబాబు వెల్లడించారు.