పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు : డాక్టర్ రాజశేఖర్

శనివారం, 25 మే 2019 (17:27 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, ఆయన అన్న నాగబాబుకు వ్యతిరేకంగా తాము ప్రచారం చేసినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పష్టం చేసారు. ఇదే అంశంపై ఆయన తన భార్య జీవితతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, పవన్‌కు, నాగబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం తాను చేయలేదన్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భీమవరంలో పవన్‌కు, నరసాపురంలో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్టు వస్తున్న వార్తలు కరెక్టు కాదన్నారు. తమ పార్టీ నాయకత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తాము ప్రచారం చేశామన్నారు.
 
ఇకపోతే తాము వరుసబెట్టి పార్టీలు మారుతున్నామని వస్తున్న వార్తలను కూడా రాజశేఖర్ కొట్టిపారేశారు. పార్టీలు మారితే తప్పేంటి? ఓటర్లు ఎప్పుడూ ఒక పార్టీకే ఓటేస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో ఎన్నికల్లో ఇంకో పార్టీకి వేస్తారని, అలాగే, సందర్భాన్ని అనుసరించి తాను పార్టీలు మారామని చెప్పారు. ఏపీలో వైసీపీ విజయంపై రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మరో 10 లేదా 15 యేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉంటారని రాజశేఖర్ జోస్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా? లేదా?... వైకాపా నేతలు