ప్రగతి భవన్‌లో జగన్‌కు కేసీఆర్ - కేటీఆర్ సాదర స్వాగతం

శనివారం, 25 మే 2019 (18:35 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎల్పీ నేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన అమరావతి నుంచి విజయవాడకు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 
 
అక్కడ నుంచి ఆయన నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు తన భార్య వైఎస్. భారతిరెడ్డితో కలిసి వెళ్లారు. ప్రగతి భవన్‌లో జగన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లు కారు వద్దకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరస్వాగతం పలికి నేరుగా నివాసంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను పరిచయం చేసిన అనంతరం తన మంత్రివర్గ సహచరులను, పార్టీ సీనియర్ నేతలను జగన్‌కు పరిచయం చేశారు. 
 
ఈ సందర్భంగా జగన్‌కు కేసీఆర్ స్వీట్లు తినిపించి శాలువా కప్పి, హంసవీణను బహుకరించారు. కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో నివాసానికి వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమై, తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పులివెందుల అసెంబ్లీ ఓటర్లకు అభ్యర్థి జగన్ కూడా నచ్చలేదట...