Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోశయ్య లాంటి నేత చనిపోతే... నివాళులర్పించే తీరిక లేదా మీకు?

రోశయ్య లాంటి నేత చనిపోతే... నివాళులర్పించే తీరిక లేదా మీకు?
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (15:49 IST)
చిలకలూరిపేట వైసీపీలో రగిలిన చిచ్చు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. నిన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రొటోకాల్‌ రగడతో వివాదం రేకెత్తగా నేడు దివంగత నేత రోశయ్య సంస్మరణ సభలో మర్రి రాజశేఖర్‌ బావమరిది సోమేపల్లి వెంకటసుబ్బయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తాయి. రాజశేఖర్‌ మామ, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కుమారుడైన వెంకట సుబ్బయ్య ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఆనాడు తండ్రికి, ఆ తరువాత రాజశేఖర్‌కు రాజకీయంగా అండగా ఉంటూ వచ్చారు. వివాదరహితుడుగా కూడా పేరుంది. 
 
 
అటువంటి వ్యక్తి చిలకలూరిపేటలో రోశయ్య సంస్మరణ సభలో మర్రి రాజశేఖర్‌ సాక్షిగా బావకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. గతంలో ఎప్పుడూ అంతరంగిక సమావేశాల్లో కూడా ఇద్దరు, ముగ్గురి సమక్షంలో కూడా ఇలా మాట్లాడలేదని అన్నారు. తన బావ రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవటం మోసం చేయటమేనని ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్టు రాజశేఖర్‌కు కాకుండా రజనీకి ఇచ్చే సమయంలో తమను గుండెల్లో పెట్టుకొని చూస్తామన్న నేతలు, ఇప్పుడు గుండెలపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమ స్తోమతకు మించే  సేవలందించామని అన్నారు. సొంత కులం నుంచి తరచూ విమర్శలు ఎదుర్కొంటూనే ఆ కులాన్ని కాదనుకొని అప్పట్లో కాంగ్రెస్‌కు, ఆ తరువాత వైసీపీకి కొమ్ముకాస్తూ వచ్చినందుకు తమకు తగిన శాస్తే జరిగిందన్నారు. 
 
 
రాజశేఖర్‌ ఇంటి ఎదుట జరిగిన ఈ సంస్మరణ సభలో ఆయన సాక్షిగానే వెంకటసుబ్బయ్య ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈ సభలో ముఖ్యమంత్రిగా రోశయ్య సేవలను కొనియాడుతూనే. వైసీపీపై విమర్శలు గుప్పించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారెవరూ సహకరించలేదని, ఆయన దిగే వరకు విశ్రమించలేదని విమర్శించారు. కుల బలం లేకున్నా, అనేక పదవులు స్వయం ప్రతిభతో సాధించుకొని రాణించిన రోశయ్య లాంటి నేత చనిపోతే వెళ్ళి నివాళులర్పించే తీరిక కూడా లేదంటూ పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేశారు. వెంకట సుబ్బయ్య ప్రసంగం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో వైసీపీ నేతల్లో కలవరం రేకెత్తింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు ఓట్లు వేయ‌డ‌మే గిరిజ‌నులు చేసిన పాప‌మా?