విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ హరనాధ మందిరంలో జరిగిన దొంగతనం కేసులో పాత అంతర్ రాష్ట్ర నేరస్థుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 18 కేసులలో రూ .60,09,538 లక్షల విలువ గల 224.71 గ్రాముల బంగారం, 80.256 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలోని వివిధ మందిరాలలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఆదేశాల మేరకు దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. పాత నేరస్థులు , జైలు నుండి విడుదలైన నేరస్థులు, అనుమానాస్పద వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ఈ నవంబరు 26న విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ హరనాధ మందిరంలో దొంగతనం జరిగినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్.నెం . 520/2021 సెక్షన్ 457 , 380 ఐ.పి.సి. కేసు నమోదు చేశారు. ఇదే మందిరంలో డిసెంబర్ 2020 వ సవంత్సరంలో కూడా చోరీ జరిగింది . ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, భాద్యతలు తీసుకున్న తరువాత కుసుమ హరనాధ మందిరంలో జరిగిన నేరంపై ప్రత్యేక దృష్టి పెట్టి నేరాన్ని చేదించమని వెస్ట్ డి.సి.పి. బాబురావుకు ఆదేశాలు ఇచ్చారు.
వెస్ట్ ఏ.సి.పి. హనుమంతరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , ఎస్.ఐ.లు శంకర్, ఆర్.వి.ఎన్ . మూర్తి వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరం జరిగిన ప్రదేశంలో నేరం జరిగిన తీరును , క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన ఆధారాలు పరిశీలించారు. నేర స్థలం, వివిధ ప్రదేశాలలో ఉన్న సి.సి. కెమెరా ఫుటేజ్ ఆధారంగా, అన్ని కోణాలలో దర్యాప్తును కొనసాగించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితుని వాగ్మూలం ఆధారంగా ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో మందిరాలలో నేరాలకు సంబంధించిన 18 కేసులలో రూ .60,09,538 లక్షల విలువ గల 224.71 గ్రాముల బంగారం, 80.256 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ , తూకారం గేటు ప్రాంతానికి చెందిన అంగోత్ రాములు నాయక్ ( 64 ) ఈ కేసులో మొదటి నిందితుడు. ఇతను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలలో వివిధ మందిరాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతడు గతంలో 2011 వ సంవత్సరం కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్య దేవాలయంలో బంగారం, వెండి వస్తువులు దొంగిలించిన కేసులో అవనిగడ్డ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సదరు కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత, తనకు ఉన్న వ్యసనాల వలన తేలికగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో మరలా నేరాలకు పాల్పడ్డాడు.
నిందితుడు 2018 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఐదు జిల్లాలో ( పశ్చిమగోదావరి జిల్లా , గుంటూరు జిల్లా , ప్రకాశం జిల్లా , విజయవాడ , నల్గొండ జిల్లాలో 14 పోలీస్ స్టేషన్ల పరిధిలలో 18 మందిరాలలో నేరాలకు పాల్పడి ఇప్పటి వరకు ఎవరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
నిందితుడు వివిధ ప్రాంతలలో ఉన్న మందిరాలలో ముందుగా సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొని అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటాడు. రాత్రి సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా తనతో తీసుకుని వచ్చిన ఒక ఇనుప రాడ్డుతో బలవంతంగా మందిరం తాళం విరగకొట్టి లోనికి ప్రవేశించి, మందిరం లోపల ఉన్నటువంటి వెండి మరియు బంగారంపు ఆభరణాలను దొంగిలిస్తాడు.
వాటిని తీసుకుని నేరం చేసిన ప్రాంతానికి కొంత దూరంలో దాచిపెట్టి, మరలా కొద్ది రోజుల తరువాత వాటిని తీసుకుని, బంగారం, వెండి వస్తువులను రాయితో చితకగొట్టి, వాటి ఆకారాలు మర్చి బ్యాగులో వేసుకుంటాడు. నిందితుడి అవసరాల మేరకు కొద్ది కొద్దిగా అమ్ముకుని వచ్చిన నగదును తన విలాసాలకు వాడుకునేవాడు. ఇలాంటి పాత నేరగాడిని పట్టుకుని బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు.