ఏపీలో అతిసార కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్ భయంతో జనం జడుసుకుంటుంటే అతిసారం ఏపీకి చుక్కలు చూపిస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలుషిత నీరు తాగడంతో చాలామంది అతిసారకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరులో అతిసార కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. యాగవల్లి అనే మహిళ తిరుపతి రూయా ఆసుపత్రిలో, సుగుణమ్మ చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.
అంతేగాకుండా 15 రోజుల్లో 60 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురు, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అయితే, ఈ వ్యాధికి కారణం కలుషిత నీరేనని, అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఆశ, ఏఎన్ఎం, వాలంటీర్, డాక్టర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని గతంలోనే ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.