Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక‌టా! క‌రెంటు రుణాల వ‌సూలుకు, అమ‌రావ‌తికి వ‌చ్చేసిన కేంద్ర బృందం

అక‌టా! క‌రెంటు రుణాల వ‌సూలుకు, అమ‌రావ‌తికి వ‌చ్చేసిన కేంద్ర బృందం
విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (11:12 IST)
ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేసిన బకాయిలు, ఇపుడు ఆయా శాఖ‌ల మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ఏపీలో విద్యుత్ సంస్ధల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సంస్ధలు నష్టాల బాట పట్టగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి మరింత పెరుగుతూ పోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఆర్ధిక సంస్ధల నుంచి భారీ ఎత్తున రుణాలు తెచ్చి వాడుకుంటున్నారు. వీటి నుంచి తీసుకున్న రుణాల్ని ఇతర అవసరాల కోసం కూడా వాడేస్తున్నారు. దీంతో ఇప్పుడు అవి కాస్తా పేరుకుపోవడం, బకాయిలు తిరిగి చెల్లించకపోవడంతో వసూలు చేసుకునేందుకు ఏకంగా కేంద్ర బృందాలు అమరావతి రావడం కలకలం రేపుతోంది.
 
 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్ధలు ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో కొన్నేళ్లుగా నష్టాల బాటలో సాగుతూ అప్పులపైనే ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం 24 గంటలూ కరెంటు అందుబాటులో ఉన్నా ధర్మల్ ప్లాంట్లకు, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు ఎక్కువ రేట్లకు గతంలో చేసుకున్న పీపీఏలు గుదిబండలుగా మారిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో అప్పులు తెచ్చి మరీ వ్యవస్ధలు కుప్పకూలిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్ధితి. దీంతో వీటి అఫ్పులు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఆర్ధిక సంస్ధల నుంచి వీరికి రుణాలు లభించే అవకాశం ఉండటంతో అక్కడా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ పోయాయి. అదే సమయంలో నష్టాల్ని తగ్గించుకుని మెరుగైన పనితీరు చూపించడంలో విఫలమయ్యాయి. దీంతో అప్పుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే పోతోంది.
 
 
కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల నుంచి విచ్చలవిడిగా అప్పులు తెచ్చుకుని తమ అవసరాల కోసం వాడేసుకుంటున్న డిస్కంలు వాటిని తిరిగి చెల్లించే విషయంలో ఆ శ్రద్ధ చూపించడం లేదు. దీంతో గతంలో భారీగా అప్పులు తెచ్చుకున్న జెన్ కో వాటిని చెల్లించలేని పరిస్ధితికి వచ్చేసింది. అయినా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏపీ జెన్ కో తీసుకున్న అప్పులు తీర్చకపోవడం, ఇచ్చిన గడువు పూర్తయి 3 నెలలు దాటిపోవడంతో నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేర్చింది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందిరకరమైన పరిస్ధితి ఏర్పడింది.
 
 
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఆర్ధిక సంస్ధలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఎప్పుడైతే ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో పెట్టారని తెలిసిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి పరుగులు తీశారు. ఈసారికి కనికరించాలని కోరారు. కొంత గడువు ఇస్తే అప్పులు తిరిగి చెల్లిస్తామన్నారు. కానీ అప్పటికే అప్పులు తిరిగి చెల్లించకపోగా.. మూడు నెలల పాటు మొహం చాటేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేందుకు కేంద్రం నో అంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని చెల్లించి మిగిలిన అంశాలపై మాట్లాడే పరిస్ధితికి వచ్చేసింది. అయినా కేంద్రానికి చెల్లించేందుకు డబ్బులు లేని పరిస్ధితి.
 
 
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఆర్దిక సంస్ధల నుంచి రాష్ట్రంలో డిస్కంలు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడం, ఆ తర్వాత కేంద్రంతో రాష్ట్ర అధికారులు జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో కేంద్ర ప్రభుత్వ బృందాలు ఏపీకి బయలుదేరాయి. నిన్న సాయంత్రం విజయవాడ చేరుకున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర విద్యుత్ సంస్ధల అధికారులతో భేటీ కాబోతున్నారు. తమ అప్పులు ఎప్పుడు చెల్లిస్తారో తెలుసుకోనున్నారు. చెల్లించకపోతే తలెత్తే పరిణామాల్ని సైతం వివరించనున్నారు. కేంద్రం ప్రభుత్వ ఆర్ధిక సంస్ధలైన పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ (ఆర్ఈసీ) ఎండీలే ఈ అప్పుల వసూళ్ల కోసం ఏపీకి రావడం విశేషం. ఇవాళ డిస్కంల ప్రతినిధులతో చర్చించాక సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీతోనూ వారు చర్చలు జరపబోతున్నారు.
 
 
కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్కే సింగ్ ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎంవో నుంచి ఆయనకు ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం. జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే విద్యుత్ సంస్ధల బకాయిల వ్యవహారంపై ఆయన చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీలో జగన్.. విద్యుత్ సంస్ధలకు రావాల్సిన బకాయిల వ్యవహారం అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి జగన్ తో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ జగన్ ఇప్పటివరకూ ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు చేయకపోవడంతో కేంద్రమంత్రి ఆర్కేసింగ్ అమరావతి రాలేకపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో బాబును కుమ్మేస్తున్న వైసిపి, దర్శిలో ఫ్యానుకి ఎదురుగాలి