ఉమ్మడి హైకోర్టు విభజన... ఇరు రాష్ట్రాలకు కేటాయించిన జడ్జీలు వీరే
ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయ శాఖ సమ్మతం తెలిపింది. దీంతో త్వరలోనే నవ్యాంధ్రప్రదేశ్ అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకానుంది. అదేసమయంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసింది.
ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయ శాఖ సమ్మతం తెలిపింది. దీంతో త్వరలోనే నవ్యాంధ్రప్రదేశ్ అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకానుంది. అదేసమయంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 మంది న్యాయమూర్తులను, తెలంగాణ రాష్ట్రానికి 24 మంది జడ్జీలను ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులను విభజించారు. దీని ప్రకారం, ప్రస్తుతం హైకోర్టులో ఉన్న 31 మంది న్యాయమూర్తుల్లో 18 మందిని ఏపీకి; 13 మందిని తెలంగాణకు కేటాయించనున్నారు.
నిజానికి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 61. ఇందులో 60 శాతం న్యాయమూర్తులను అంటే 37 (36.6) మందిని ఆంధ్ర ప్రదేశ్‌కు, 40 శాతం న్యాయమూర్తులను అంటే 24 (24.4) మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేసే నిమిత్తం ఎవరెవరు ఏ రాష్ట్రానికి వెళ్లదలిచారో వారు తమ ఆప్షన్లు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తులను కేంద్రం కోరింది.
ఈ మేరకు 2015లోనే న్యాయమూర్తులందరూ ఆప్షన్లను సీల్డ్ కవర్‌లో సమర్పించారు. ఇటీవల నియమితులైన న్యాయమూర్తులు వారి నియామకం తర్వాత ఆప్షన్లు ఇచ్చారు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయమూర్తుల ఆప్షన్లపై చర్చించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ సమావేశంలో న్యాయమూర్తుల ఆప్షన్లకు కొలీజియం ఆమోదముద్ర వేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఆప్షన్లకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో మొత్తం 61 న్యాయమూర్తులకుగాను 31 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు న్యాయమూర్తులు బయటి రాష్ట్రాలకు చెందిన వారు. ఈ నేపథ్యంలో 29 మంది న్యాయమూర్తులు ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన వారు. ఈ 29 మందిలో 17 మందిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 12 మంది తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా రానున్నారు.
కాగా, తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల వివరాలను పరిశీలిస్తే.. 1.జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి (ప్రస్తుతం గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు), 2. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, 3. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, 4. జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు, 5. జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, 6. జస్టిస్ పి.నవీన్‌రావు, 7. జస్టిస్ చల్లా కోదండరామ్, 8. జస్టిస్ బి.శివశంకర్‌రావు, 9. జస్టిస్ ఎమ్మెస్కే జైస్వాల్, 10. జస్టిస్ జి.శ్యాంప్రసాద్, 11. జస్టిస్ షమీమ్ అక్తర్, 12. జస్టిస్ పి.కేశవరావు, 13. జస్టిస్ ఎం.గంగారావు, 14. జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి, 15. జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లు ఉన్నారు.
అలాగే, ఏపీకి కేటాయించిన న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తే.. 1. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, 2. జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, 3. జస్టిస్ ఎస్వీ భట్, 4. జస్టిస్ ఏవీ శేషసాయి, 5. జస్టిస్ ఎ.రామలింగేశ్వర్‌రావు, 6. జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, 7. జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, 8. జస్టిస్ టి.సునీల్ చౌదరి, 9. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, 10. జస్టిస్ జె.ఉమాదేవి, 11. జస్టిస్ ఎన్.బాలయోగి, 12. జస్టిస్ ఎ.శంకర్ నారాయణ, 13. జస్టిస్ డీవీఎస్ సోమయాజులు, 14. జస్టిస్ టి.రజని, 15. జస్టిస్ డి.శేషాద్రి నాయుడు (ప్రస్తుతం కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు), 16. జస్టిస్ శ్యాంప్రసాద్, 17. జస్టిస్ కె.విజయలక్ష్మి, 18. జస్టిస్ ఎం.గంగారావులు ఉన్నారు.