ఒహియో విద్యార్థులతో సమానంగా ఏపీ విద్యార్థులకు ఫీజులు... మంత్రి గంటా
అమరావతి: అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి వివిధ కోర్సులు చదివేందుకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు భారీ స్వాంతన లభించనుంది. ఏపీ విద్యార్థులకు అక్కడి స్థానిక విద్యార్థులతో సమానంగా ఫీజు చెల్లించేలా రాష్ట్ర విద్యాశాఖ అక్కడి ప్రభుత్వం
అమరావతి: అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి వివిధ కోర్సులు చదివేందుకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు భారీ స్వాంతన లభించనుంది. ఏపీ విద్యార్థులకు అక్కడి స్థానిక విద్యార్థులతో సమానంగా ఫీజు చెల్లించేలా రాష్ట్ర విద్యాశాఖ అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల ఒహియో రాష్ట్ర వర్శటీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 8.5 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
అమెరికన్ విద్యా సంవత్సరం జనవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారిక పర్యటనలో అమెరికాలో వున్న మంత్రి గంటా... అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఒహియో విద్యాశాఖ మంత్రి జాన్ క్యారీతో ఒహియో రాజధాని కొలంబస్ లోని విద్యాశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఏపీ విద్యార్థులకు పూర్తి ఫీజులో సగం మాత్రమే చెల్లించేలా.. అంటే అక్కడి స్థానిక విద్యార్థుల మాదిరిగా ఫీజు చెల్లించే అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గతంలోనే ఈ అంశంపై అవగాహన కుదిరినప్పటికీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తుది ఎంఓయూపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సంతకాలు చేశారు.
ఒప్పందం ఖరారయిన సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి యేడు ఒహియోకు ఎపి నుంచి 3 నుంచి 4 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వస్తున్నారని, వీరికి ఈ ఎంఓయూ ద్వారా భారీ లబ్ధి కలుగుతుందని అన్నారు. ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రమూ ఇలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఏపీ విద్యార్థుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దితో వుందని ఆ క్రమంలోనే మన విద్యార్థులకు లబ్ధి కలిగే అనేక రకాలు ఒప్పందాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఎంఓయూతో స్థానిక విద్యార్థులతో సమానంగా ఎపి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు.
ఎంఓయూ అమలు కోసం రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమిస్తామని చెప్పారు. ఈ ఎంఓయూని అనుసరించే ఒహియో రాష్ట్రంలోని అన్ని వర్శటీలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని, ఇప్పటికే రైట్ స్టేట్ వర్శటీతో ఒప్పందం ఖరారు అయ్యిందన్నారు. ఎంఓయూ అమలు కోసం నియమించిన కమిటీ ఒహియో రాష్ట్రంలోని అన్ని వర్శటీలతో సంప్రదింపులు జరిపి ఎపి విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఎంఓయూను అమలు చేయిస్తుందన్నారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.ఎస్ నుంచి మెడికల్, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సులకు ఫీజు రాయితీ వుంటుందని మంత్రి గంటా స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు ఎపిని నాలెడ్జ్ స్టేట్ -ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నవ్యాంధ్రను తీర్చిదిద్దుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ క్రమంలోనే, ఇప్పటికే అమెరికన్ విద్యా విధానాన్ని పరిశీలించి, ఎపికి అనుకూలమైన అనేక విధానాలు రాష్ట్రంలో ప్రవేశ పెట్టమన్నారు. విద్యార్థులకు ఉద్యోగవకాశాలు పెంచే విధంగా నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు ప్రపంచంలో ఎక్కడ ఎపి విద్యార్థులు వున్నా వారి సంక్షేమానికి ఎపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే విదేశాలకు వెళ్లే పేద విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు.
అనంతరం మంత్రి గంటా ఆధ్వర్యంలోని బృందం.. ఒహియో విద్యాశాఖ మంత్రి జాన్ క్యారీతో వివిధ అంశాలపై చర్చించింది. అక్కడి వర్శటీలో చేపట్టిన సంస్కరణలు, బోధన విధానం, ఫీజులు తదితర అంశాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ చర్చ జరిగింది. ఈ ఎంఓయూ కారణంగా.. రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు అధికశాతం ఒహియో వర్శటీల్లో చేరేందుకు ఆసక్తి చూపే అవకాశం వుంది.