పార్టీకి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ వంటి వ్యక్తితో స్నేహమా?
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు దాసోహమైపోయారని ఆరోపించారు. ఆ కారణంగానే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను కట్టబెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై రేవంత్ స్పందిస్తూ, కేసీఆర్ నుంచి యనమల రామకృష్ణుడు కంపెనీకి రూ.2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కగా, పయ్యావుల కేశవ్ సంస్థలకు కూడా కాంట్రాక్టులు వెళ్లాయని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ను తెరాస ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే, ఏపీలో మాత్రం నేతలు కేసీఆర్‌తో అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ వంటి వ్యక్తితో స్నేహమా? అంటూ ఆయన సూటిగా నిలదీశారు.
కాగా, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగగా, ఇంతవరకూ ఏపీకి చెందిన ఒక్క టీడీపీ నేత కూడా స్పందించక పోవడం గమనార్హం. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎవరూ ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక పార్టీ అధినేత ఆదేశాలే కారణంగా ఉంది.