Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు బెస్ట్ ఫ్రెండ్స్.. నేడు బద్ధవిరోధులు.. ఎవరువారు?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఏపీ ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్రాల నేతలు. అయితే, ఇపుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మాడిమసైపోతోంది. అంతలా ప

నాడు బెస్ట్ ఫ్రెండ్స్.. నేడు బద్ధవిరోధులు.. ఎవరువారు?
, బుధవారం, 25 అక్టోబరు 2017 (06:18 IST)
తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఏపీ ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్రాల నేతలు. అయితే, ఇపుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మాడిమసైపోతోంది. అంతలా పెరిగిపోయింది వీరిద్దరి మధ్య వైర్యం. వీరిద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం ఇపుడు రాజకీయంగా పెను చర్చనీయాంశమైంది.
 
ఇద్దరు నేతలూ వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో పార్టీకి నష్టం జరుగుతోందని సీనియర్లు బాధపడుతున్నారు. వీరిద్దిరి విమర్శలు, ఆరోపణలు టీడీపీని టార్గెట్‌ చేసేందుకు ఇతర పార్టీలకు అస్త్రాలు అందించినట్టు అయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటికి ఇప్పటికైనా ముగింపు పలకపోతే అసలుకే మోసం వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
అసలు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే... ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ పెళ్లి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనంతపురం జిల్లా వెంకటాపురం వెళ్లారు. కేసీఆర్‌కి పయ్యావుల కేశవ్‌ అతి మర్యాద చేశారనే ప్రచారం జరిగింది. హెలిపాడ్‌లో ఇద్దరూ కలిసి ఐదు నిమిషాలు ఏకాంతగా చర్చలు జరిపిన విషయం చర్చోపర్చలకు దారితీసింది.
 
దీనిపై రేవంత్‌రెడ్డి... టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు... పయ్యావుల కేశవ్‌ను మందలించారు. ఈ ఎపిసోడ్‌ ముగియక ముందే ఇప్పుడు మరో ఇష్యూపై ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
 
ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసినట్టు ప్రచారం జరిగింది. టీడీపీని వీడే ఉద్దేశంతోనే రేవంత్‌ ఈ విధంగా చేశారన్న వాదనలు ఉన్నాయి. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి... పనిలో పనిగా పయ్యావుల కేశవ్‌ను టార్గెట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పయ్యావుల కేశవ్‌ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు.
 
దీనిపై తీవ్రంగా స్పందించిన పయ్యావుల కేశవ్‌... తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేశారు. గత ఆరు నెలల్లో రేవంత్‌ ఎన్నిసార్లు, ఢిల్లీ వెళ్లారో, ఎవరెవరిని కలిశారో తన వద్ద సమాచారం ఉందని కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో రేవంత్‌ ఎవరెవరితో వ్యాపారాలు చేస్తున్నారో ఆధారాలున్నాయన్న వాదాన్ని లేవనెత్తారు. ఇలా ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడం ఇపుడు సొంత పార్టీలోనేకాదు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పాపను ఏ తల్లికి ఇవ్వాలి? మీరేమైనా చెప్పగలరా?