Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (22:55 IST)
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు.

దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
 
దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు.

ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.

ఈ రోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.

మహర్నవమి
మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు.

దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.
 
విజయదశమి
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది.

ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 
 
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 
 
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
 
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
 
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్ప ఆలయానికి రోజూ 25 వేల మందికి ప్రవేశం