శరన్నవరాత్రులలో బెజవాడ కనకదుర్గమ్మ దశావతారాలతో భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై సాక్షాత్కరిస్తుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా వేడుకలను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుంది.
బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఏటా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. కనీసం 15లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
కానీ.. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఈ ఏడాది భక్తుల రద్దీని పూర్తిగా తగ్గించేశారు. రోజుకు 10వేల మందికి మాత్రమే అనుమతిస్తామని అది కూడా ముందుగా ఆన్లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న భక్తులనే అమ్మవారి దర్శనానికి అనుమతించే విధంగా దుర్గగుడి అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో నవరాత్రుల మొత్తం మీద అమ్మవారిని లక్ష మంది మాత్రమే దర్శించుకునే వీలుంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్తిస్తారు.
ముగింపు సందర్భంగా విజయదశమి రోజున దుర్గాదేవిని హంసవాహనంపై ఊరేగిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ఈ ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించనున్నారు.
పరమ దుర్మార్గుడైన మహిషాసురుడి బారినుంచి దేవతలనూ మనుషులనూ రక్షించేందుకు ఘోర యుద్ధం చేసి అతడిని వధించింది దుర్గాదేవి. ఆ సమయంలో మహోగ్రంగా కనిపిస్తున్న ఆ తల్లిని చూసిన దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి .. ఇంతటి ఉగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షసవధకే గానీ మేమెట్లు భరించగలం, శాంత రూపిణివై లోకాలను కాపాడమని వేడుకున్నారు.
అప్పుడా తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరీ దేవిగా అవతరించింది. నాటి నుంచి ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకూ జరిగే శరన్నవరాత్రోత్సవాలలో నన్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలూ, సుఖ శాంతులూ కలుగుతాయని వరమిచ్చింది.
అయితే అనంత రూపిణి అయిన అమ్మవారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్కడేంయ మహర్షికి ఓ సందేహం వచ్చింది. నేరుగా బ్రహ్మదేవుడిని కలిశాడు. దాంతో సాక్షాత్తూ సృష్టికర్తే నవదుర్గా రూపాలను వర్ణించాడు. జగన్మాత సకల చరాచర జగత్తును సృష్టించేందుకు శ్రీదుర్గ, మహాలక్ష్మీ, సరస్వతి, గాయత్రి, శారదాదేవి రూపాలను ధరించింది.
ఈ పంచ రూపాలలో అది ప్రకృతిస్వరూపం కనుక దుర్గమ్మ మహిషాసురుణ్ని సహరించిన తరువాత పవిత్ర కృష్ణా తీరంలోని ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా అవతరించింది. సాధారణ రోజుల్లో కంటే ఈ పది రోజుల్లో కనకప్రభలతో వెలసిన దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు కోటి రెట్లు పుణ్యం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.