వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికలోని మూల అంశాలను ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతారు.
కొత్త ప్రభుత్వం పరిపాలనా తీరుతెన్నులపై కనీసం వంద రోజులపాటు ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగిసిపోయింది. వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పని తీరును అధ్యయనం చేయడానికి పార్టీలోని నేతలు, నిపుణులతో పది బృందాలను పవన్ కళ్యాణ్ నియమించారు.
వీరు తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికలను పవన్ కళ్యాణ్ కి అందచేశారు. ఈ నివేదికల్లోని ముఖ్యాంశాలను క్రోడీకరించి అమరావతిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ నెల 13, 14, 15 తేదీలలో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, వివిధ వర్గాల వారిని కలుసుకుంటారు.