Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాంటీన్లతో భారీగా ప్రజాధనం వృధా... టీడీపీపై బొత్స ఆగ్రహం

క్యాంటీన్లతో భారీగా ప్రజాధనం వృధా... టీడీపీపై బొత్స ఆగ్రహం
, గురువారం, 1 ఆగస్టు 2019 (19:37 IST)
అతితక్కువ ధరలకు ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన క్యాంటీన్లను ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించిందని, వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

క్యాంటీన్ల పనితీరుకు సంబంధించి గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, స్థల లభ్యత, నిర్వహణ వెసులుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు తీసుకుంటామన్నారు. 
 
పట్టణ ప్రాంతాల్లో గతంలో నిర్మించిన 182 అన్న క్యాంటీన్లలో చాలావరకు  ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, విధివిధానాలు లేకుండా ఏర్పాటు చేయడంతో వీటి ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. 
ఎంతో హడావుడిగా, ప్రచార ఆర్భాటంతో వీటిని ప్రారంభించిన గత ప్రభుత్వం వీటి నిర్మాణానికి సంబంధించిన కోట్లాది రూపాయల బిల్లులతోపాటు, నిర్వహణ ఖర్చులను కూడా చెల్లంచలేదన్నారు.

వీటి నిర్మాణాలకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్లు, వీటిలో పంపిణీ చేసిన ఆహారానికి సంబంధించి ఆరు నెలల పాటు బిల్లులు ఇవ్వలేదని, ఇలా మరో రూ. 40 కోట్లు పెండింగ్‌ లో ఉంచారని ధ్వజమెత్తారు.  పేదలపై గత ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, కోట్ల రూపాయాల్లో అప్పుపెట్టి, పంచభక్షపరమాన్నాలు పెట్టినట్టుగా ప్రచారం చేసుకుందని ఆయన విమర్శించారు. ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో అంటే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల వంటి చోట్ల కాకుండా అసలు రద్దీలేని చోట్ల, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్నట్టుగా క్యాంటీన్‌ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని క్యాంటీన్లలో సుమారు 68 క్యాంటీన్లు ప్రస్తుతమున్న చోట్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని గుర్తించామని, మిగిలినవి ప్రజలకు చేరువగా లేని ప్రదేశాల్లో నిర్మించారన్నారు.

ఇలాంటి చర్యలతో ప్రజాధనాన్ని వృధా చేశారని ఆయన తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వీటి నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామన్నారు. ప్రజా ప్రయోజనాలతో పాటు, క్యాంటీన్లను వినియోగించే వారికి ఏవి అవసరమో, ఏ ప్రదేశాల్లో వీటి ఆవశ్యకత ఉందో అన్న వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి కొత్తపాలసీని తీసుకుని వచ్చి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీముఖికి రోజుకి రూ. 3 లక్షలా.... ఏంటి అంత క్రేజ్...? మాట్లాడతావా బిగ్ బాస్?