టీడీపీ పాలనలో మహిళలను తెలుగింటి ఆడపడుచులుగా భావించి వారికి ఎనలేని గౌరవం కల్పిస్తే.. వైసీపీ పాలనలో మహిళలను వైసీపీ కార్యకర్తలు అవమానాలకు గురి చేస్తున్నారని శాసనమండలి సభ్యురాలు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు.
గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తూ.గో జిల్లా పి. గన్నవరంకు చెందిన తెలుగు మహిళా అధ్యక్షురాలిపై వైసీపీ కార్యకర్తలు అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు డ్వాక్రా సంఘాలు స్ధాపించి మహిళల ఆర్ధికాభివృద్దికి కృషి చేస్తే వైసీపీ పాలనలో సోషల్ మీడియా ద్వారా మహిళలను అవమానపరుస్తున్నారని ఆమె ద్వజమెత్తారు. 30 సం నుంచి రాజకీయాల్లో ఉన్నామని కానీ ఇలాంటి నీచ రాజకీయాల్ని ఎన్నడూ చూడలేదన్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ సోషల్ మీడియాను ప్రోత్సహిస్తోందని ఇలాంటి విధానాలు వెంటనే మానుకోవాలని లేకపోతే వైసీపీకి మహిళలే తగిన బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
బాధిత మహిళకు పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. జగన్ 90 రోజుల పాలనలో వైసీపీ నేతలు ప్రజా సమస్యలు గాలికొదిలేసి చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవన్నీ మహిళలు గమనిస్తున్నారని సరైన సమయంలో సరైనరీతిలో వైసీపీకి బుద్ది చెప్తారని ఆమె అన్నారు.