ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలల్లో రానున్న విద్యా సంవత్సరం 2021-22 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యా విధానాన్ని ప్రారంభించున్నట్లు వెల్లడించారు.
ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ సీబీఎస్సీ విద్యా విధానాన్ని వర్తింప చేస్తామని వివరించారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఇందుకు సంబంధించి ఎఫిలియేషన్ కోసం సీబీఎస్‌ఈ బోర్డుతో చర్చించి, ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కామన్ సిలబస్ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా విద్యార్థులు ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తారన్నారు. తద్వారా మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.