సెంటు పట్టా పేరుతో దళితుల భూములు లాక్కున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ఏదో జరిగిపోతోందంటూ దొంగ పత్రిక అబద్ధాలు ప్రచారం చేస్తోంది అక్రమ కేసులు ఎదుర్కోవడం చంద్రబాబుకు లెక్కేమీ కాదు. అమరావతిపై జగన్ రెడ్డి పగ ఇంకా తీరలేదు. రెండేళ్లకు జగన్ రెడ్డికి దళితులు గుర్తొచ్చారంటే ఆశ్చర్య వేస్తోంది.
రాజధాని మార్పుతో తమకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన దళితులను బేడీలు వేసి 18 రోజులు జైల్లో పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసమే నాడు రైతుల అనుమతితో అసైన్డ్ భూములు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క దళిత రైతు కూడా చంద్రబాబుపై ఫిర్యాదు చేయలేదు.
రాజధాని నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలు భాగస్వామ్యం కావడం వైసీపీకి ఇష్టం లేదు. అసైన్డ్ భూములకు కూడా జరీబు భూములతో సమాన పరిహారం ఇచ్చిన ఘనత చంద్రబాబుది. భూములు విక్రయించుకోవడానికి అవకాశం కల్పించాలని నాడు అసైన్డ్ రైతులు చంద్రబాబును కోరారు.
అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్ అమలులోకి తెచ్చింది మీతండ్రి రాజశేఖర్ రెడ్డి కాదా? జగన్ రెడ్డి గుప్పిట్లో వందలాది దళితుల భూములు ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీల నుండి గుంజుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలి.
అధికారం వుందని ఇష్టాను సారంగా కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిపై అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించడం ఎక్కడా చూడలేదు. చేతనైతే వాస్తవాలతో వైసీపీ రావాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కొన్నాళ్లు వేశాలేశారు. ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగలేదని కోర్టు చివాట్లు పెట్టినా సిగ్గు రాలేదు. అక్రమ కేసులపై పెట్టే శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై పెట్టాలి. జగన్ కేసులను పక్కదారి పట్టించేందుకు రోజుకొక కేసుతో డ్రామాలాడుతున్నారు అని బాలవీరాంజనేయ స్వామి అన్నారు.