Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా ప్రభుత్వ కక్షపూరిత పాలన పరాకాష్టకు చేరింది : నిమ్మల

Advertiesment
Nimmala Rama Naidu
, మంగళవారం, 16 మార్చి 2021 (14:25 IST)
ఏపీలో వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత పాలన పరాకాష్టకు చేరింది. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే పాలన ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్క చాన్స్ ఇవ్వమని ప్రజలను జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు అందరూ అతనిలో వైఎస్‌ను చూశారు. జగన్‌లో ఉన్న రాజారెడ్డిని చూడలేకపోయారు. నేడు ఒక విధ్వంసమైన పాలన రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో ఒక పేపర్ చదివినా, టీవీ చూసినా ఫలానా పరిశ్రమకు శంకుస్థాపన జరిగినట్టు వచ్చేవి. కానీ నేడు పేపర్ చూస్తే ఏముంటున్నాయి? దౌర్జన్యాలు, అక్రమాలే కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్ రెడ్డి నియంతపాలనకు నిదర్శనమని తెదేపా సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 
 
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో ప్రజలను బెదిరించి, భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. చంద్రబాబును వేధించడం ద్వారా టీడీపీ క్యాడర్‌ను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది మైండ్ గేమ్‌లో భాగమే. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. 
 
క్రయ విక్రయాలు స్వేచ్ఛంగా జరిగాయని హైకోర్టు చెప్పనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చంద్రబాబుపై పుస్తకం వేశారు. అమరావతిలో 10 వేల ఎకరాల అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి బుగ్గన శాసనసభలో మాట్లాడుతూ నాలుగు వేల ఎకరాలు అన్నారు. స్టాంప్స్ అండ్ డ్యూటీ వారు చెప్పిన దాని ప్రకారం కేవలం 125 ఎకరాల్లో మాత్రమే క్రయ విక్రయాలు జరిగాయి. 
 
వైసీపీ వాళ్లు ఇన్‌సైడ్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆ రెంటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్. రూ.10 ఉండే భారతి షేర్ రూ.1400కు పెంచింది జగన్మోహన్ రెడ్డే. ఆయన తాడేపల్లిలో ఉండే ఇల్లు బినామి. ఆయన చేసే వ్యాపారాలు, రాజకీయాలు బినామీనే. కేసీఆర్‌కు బినామీగా ఏపీలో జగన్ అన్ని పనులు చేస్తున్నాడు. 16 నెలలు జైలు, 11 చార్జిషీట్లు ఉండటం వల్ల మీ బురద ఎదుటివారిపై అంటిస్తున్నారా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వచ్ఛమైన వ్యక్తి. 
 
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి... చంద్రబాబుపై 26 విచారణ కమిటీలు వేసినా కడిగిన ఆణిముత్యంలా బయటకు వేశారు. చంద్రబాబుపై వేసిన కేసులను వైఎస్ విజయమ్మ వెనక్కు తీసుకున్నారు. అటువంటి చంద్రబాబుపై అసత్యమైన కేసులు వేస్తారా? ఏపీలోనే కాదు దేశంలోనే స్వచ్ఛందంగా తన కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తన కుటుంబ ఆస్తి మొత్తం ప్రజలకు బహిరంగంగా తెలియజేస్తున్నారు. హెరిటేజ్ సంస్థ, హైదరాబాద్‌లో సొంతిల్లే ఆయన ఆస్తులు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వాళ్లు కోట్లు పెట్టి ఓట్లు కొంటే మేము చూస్తూ ఉన్నాం. మా దగ్గర దొంగ డబ్బు లేదు. 
 
బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి, బ్రాహ్మణి, సరస్వతి, భారతి సహా అన్నీ జగన్ రెడ్డివే. ఎక్కడ చూసినా లక్షల కోట్లు ఆర్జించిన జగన్ రెడ్డి చంద్రబాబు గురించి మాట్లాడ్డమా? 2004లో జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో 41 లక్షల 8 వేలు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో 510 కోట్ల పైనే ఆస్తులు చూపారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఐడియాలు ఆయన జీవితాన్నే మార్చేస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించిన మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. 
 
అసైన్డ్ భూముల వల్ల సరైన ధర రాదు, ఉపయోగం ఉండదని దళితులు వచ్చి చంద్రబాబు గారికి కోరడంతో ఆ భూములను పట్టా భూములుగా మార్చి ఉపకారం చేయడం జరిగింది. దళితుల ప్రయోజనాల కాపాడటం చంద్రబాబు గారు చేసిన తప్పా? దళితులకు లక్షల రూపాయిలు వచ్చే అవకాశం కల్పించడం నేరమా? ఇడుపులపాయకు సంబంధించి 1200 ఎకరాల అసైన్డ్ భూమిలో 613 ఎకరాలు తెలియక తీసుకున్నమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఈరోజుకీ ఆ భూమిని దళితులకు వైఎస్ కుటుంబం తిరిగి ఇవ్వలేదు. 
 
ఏ బేస్ మీద చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చారు? అగ్ర కానికి చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేసులు పెడితే ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా వర్తిస్తాయో చెప్పండి. ఆధారాలు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలపై మేము ఫిర్యాదు చేసినా ఇలాగే కేసులు నమోదు చేస్తారా? వారికి నోటీసులు ఇచ్చే దమ్ము సీఐడికి ఉందా? నియంత పోకడలు అవలంభించిన వారి చరిత్ర ఎలా ముగిసిందో మనం చూశాం. ప్రశాంతతకు చిహ్నమైన ఏపీలో ఇలాంటి పోకడలు ఎవరూ సహించరు. కక్షపూరిత రాజకీయాలు మానుకోకపోతే హిట్లర్, ముస్సోలిని, ముషారఫ్ లాంటి వారికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికీ పడుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ రెండు మున్సిపాలిటీలను ఎగరేసుకుపోయిన రోజా? మంత్రి పదవి కోసం?