మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. రాష్ట్రంలో వైసిపికి తిరుగే లేదని మరోసారి నిరూపించుకున్నారు వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల పట్ల జగన్ ఫుల్ జోష్‌లో వున్నారు. తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలైంది.
ఇదిలావుంటే.. వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ రోజా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీల విజయం కోసం తీవ్రంగా కృషి చేసారు. ఆ రెండు చోట్లా రోజా సవాలుగా తీసుకుని రూ. 5 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. సొంత పార్టీలోనే రెబల్స్ వీరవిహారం చేసినప్పటికీ రోజా మాత్రం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
భారీ విజయం నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు రోజా తాడేపల్లికి వెళ్లారు. ఐతే ఆమె మంత్రి పదవి కోసం వచ్చారని ప్రచారం జరుగుతోంది. జగన్ మొదట్లో చెప్పినట్లుగా రెండున్నరేళ్లకు ఒకసారి పాత మంత్రులను తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమిస్తానని చెప్పారు.
ఈ ప్రకారం చూస్తే త్వరలో రోజాకి మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు రోజా వెళ్లడం కనిపిస్తోంది. ఐతే కొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపేందుకు రోజా వెళ్లారని అంటున్నారు.