Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?

Advertiesment
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?
, సోమవారం, 15 మార్చి 2021 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఏకపక్షంగా గెలిచింది. విపక్షాలకు అవకాశం లేకుండా దాదాపుగా క్లీన్ స్వీప్ దిశగా సాగింది. చివరకు ఒకే ఒక్క తాడిపత్రి మునిసిపాలిటీలో మాత్రం విపక్ష టీడీపీకి స్వల్ప ఆధిక్యం దక్కింది. మిగిలిన అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి.

 
ఫలితాలు ప్రకటించిన 11 మునిసిపల్ కార్పోరేషన్లు, 73 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో అధికార పార్టీ విజయం ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే, ఈఫలితాల పట్ల భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. జగన్ పాలనకు ప్రజల్లో లభించిన ఆదరణకు ఈ ఫలితాలు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతుండగా, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం వలే ఈ విజయాలు దక్కాయని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు.

 
టీడీపీకి చరిత్రలోనే అతి పెద్ద పరాజయం
2019 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అధికారం కోల్పోయింది. తాజా మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత పెద్ద పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. 75 మునిసిపల్, నగర పంచాయతీలతో పాటుగా 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగితే ఫలితాలు ప్రకటించిన 85 స్థానాలకు గానూ టీడీపీకి కేవలం తాడిపత్రిలో మాత్రమే స్వల్ప ఆధిక్యం దక్కింది.

 
రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. కుప్పం వంటి చోట్ల పంచాయతీ ఎన్నికల్లో ఎదురయిన ఓటమికి కొనసాగింపుగా మండపేట, హిందూపురం వంటి బలమైన నియోజకవర్గాల్లో కూడా పరాజయం చవిచూడాల్సి వచ్చింది. విజయవాడ, గుంటూరు మేయర్ పీఠాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

 
అయితే, ఈ ఫలితాలు అధికారయంత్రాంగం దుర్వినియోగం మూలంగా వచ్చినవేనని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను, పోలీసులను, వాలంటీర్లను మేనిప్లేట్ చేసిన ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు. వాలంటీర్ల తీరు, అధికారయంత్రాంగం బెదిరింపులు, ఎమ్మెల్యేలు, మంత్రుల హూంకరింపులు అన్నీ అధికారపార్టీ గెలుపుకు కలిసొచ్చాయి. ఎన్నికల కమిషన్ అవకాశమివ్వలేదు గానీ, లేకుంటే వాలంటీర్లు ఇళ్లకే వెళ్లి ఓట్లేయించేవారు. పథకాలు రావని ప్రజలను భయపెట్టి గెలిచిన గెలుపుకూడా గెలుపేనా? మహారాజైన హరిశ్చంద్రుడినే కాలం కాటికాపరిని చేసిందని గుర్తుంచుకోండి. ప్రభుత్వ వ్యవస్థల దుర్మార్గాలను తట్టుకొని ధీరోధాత్తంగా పోరాడాం. మొక్కవోని ధైర్యంతో పోరాడిన టీడీపీ శ్రేణులకు పార్టీ జాతీయనాయకత్వం సెల్యూట్ చేస్తోంది" అని వ్యాఖ్యానించారు.

 
తాడిపత్రిపై అందరి దృష్టి
ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే వైసీపీ హవాకి అడ్డుకట్ట పడింది. ఆ రెండూ రాయలసీమలోనే ఉండడం విశేషం. అందులో ఒకటి తాడిపత్రి మునిసిపాలిటీ కాగా, అక్కడ టీడీపీకి స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో మునిసిపాలిటీ మైదుకూరులో వైసీపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. మెజార్టీ ఒక్క సీటు దూరంలో నిలిచింది. ఎక్స్ అఫీషియో ఓట్లు సహాయంతో గట్టెక్కాస్తామని ధీమాతో ఉంది. మైదుకూరులో టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 వార్డులో గెలిచాయి. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండడంతో వైసీపీ అతిపెద్ద పార్టీగా కనిపిస్తోంది. అయితే జనసేన కౌన్సిలర్ టీడీపీకి మద్దతు ఇస్తే బలం సమానంగా మారుతుంది. కాగా, జనసేన ఈ ఎన్నికల్లో 7 కార్పొరేటర్ స్థానాలు, 18మంది కౌన్సిలర్ సీట్లు గెలిచింది.

 
ఆసక్తికరంగా మారిన తాడిపత్రి
36 కౌన్సిల్ స్థానాలున్న ఈ మునిసిపాలిటీలో 18 మంది టీడీపీ తరపున గెలిచారు. అందులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక 16 మంది వైసీపీ తరుపున వియం సాధించగా ఒక్కొక్కరు చొప్పున సీపీఐ, ఇండిపెండెంట్లు గెలిచారు. దాంతో ఇక్కడ చైర్ పర్సన్ సీటు తమదేనని టీడీపీ భావిస్తోంది.

 
ఇప్పటికే గెలిచిన కౌన్సిలర్లందరినీ క్యాంపులకు తరలించారు. ఎక్స్ అఫీషియోల బలంతో ఈ మునిసిపాలిటీలో కూడా పాగా వేయాలని వైసీపీ ఆశిస్తోంది దాంతో తాడిపత్రి రాజకీయం ఈనెల 18 వరకూ పెద్ద చర్చకు అవకాశం ఇవ్వబోతోంది.

 
పట్టణ ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిక్యం
వైసీపీకి గ్రామీణ ఓటర్లతో పాటుగా పట్టణ ఓటర్లు కూడా పట్టం కట్టడం ఈ ఎన్నికల్లో విశేషంగానే చెప్పాలి. గత సాధారణ ఎన్నికల్లో అనేక పట్టణ నియోజకవర్గాల్లో ఆపార్టీ ఓటమి చవిచూసింది. అందులో విశాఖ నగరంలోని నాలుగు స్థానాలను కోల్పోయింది. రాజమహేంద్రవరం అర్బన్, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఇచ్చాపురం, హిందూపురం, చీరాల, మండపేట సహా అనేక మునిసిపల్ పట్టణాలున్న నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత అర్బన్ ఓటర్లలో కూడా పట్టు సాధించాలని వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా చెప్పవచ్చు.

 
ఆ పార్టీకి 2014 మునిసిపల్ ఎన్నికల్లో కేవలం 19 మునిసిపాలిటీలు మాత్రమే దక్కగా ఈసారి సంపూర్ణ ఆధిక్యం సాధించింది. ఈ ఫలితాల పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.. విజయాలకు కారణాలపై మంత్ని కన్నబాబు బీబీసీతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వాన్ని జనం తిరస్కరించారని, ఇది జగన్ నాయకత్వానికి ఉన్న ఆదరణ మూలంగా వచ్చిన విజయమేనని మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు. జీవీఎంసీ సహా అన్ని చోట్లా దక్కిన విజయాలు ప్రభుత్వ పనితీరుకి ప్రజల్లో లభించిన మద్ధతుగా ఆయన పేర్కొన్నారు.

 
21 నెలల పాలన తర్వాత ఎన్నికలు జరిగినా బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. నిజానికి సీఎం జగన్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. ఎవరినీ ఓటు అడగలేదు. అయినా ఘన విజయం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 98 శాతం స్థానాలు ఇచ్చారు. దీంతో కలిపి ఇప్పటి వరకు చంద్రబాబునాయుడు ప్రజలు మూడు సార్లు రిజెక్ట్‌ బటన్‌ నొక్కారు. చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా ప్రచారంలో ఏం పీకుతున్నారంటూ ప్రజలను అడిగారు.

 
అందుకే ప్రజలు ఆ పార్టీని, వారి అహంభావాన్ని పీకేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తామే చేస్తున్నామని కేంద్రం స్పష్టంగా చెప్పినా, చంద్రబాబునాయుడు అండ్‌ కో. అందుకు జగన్‌ గారు కారణమని అసత్య ప్రచారం చేశారు. దీంతో గాజువాకలో మేము గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. గెలిపించారు’ అంటూ బీబీసీతో అన్నారు.

webdunia
పథకాలు ఆపేస్తామని బెదిరించి గెలిచారు...
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు సాధించిన జనసేన పంచాయతీ ఎన్నికల్లో మార్పు మొదలయ్యింనే నినాదం ముందుకు తీసుకొచ్చింది. మునిసిపల్ పోరులో కూడా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేసింది. అయితే అమలాపురం, నర్సాపురం మునిసిపాలిటీలలో మాత్రమే ఆపార్టీ ప్రభావం కొద్దిమేరకు కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పోరేషన్లు, 18 మునిసిపాలిటీలలో ఆపార్టీకి ప్రాతినిధ్యం దక్కింది.

 
అయితే ఈ ఎన్నికల ఫలితాలకు కారణం అధికార దుర్వినియోగం అని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ పక్షం అనేక అక్రమాలకు పాల్పడిందని జనసేన ఆరోపించింది. ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. బెదిరింపులతోనే వైకాపా ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని కూడా బెదిరించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామన్నారు. ప్రజల మనసులు మెచ్చి వైకాపాకి ఓట్లు సాధించలేదు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. జనసేన శ్రేణులు పోరాడారు. ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు అంటూ పవన్ పేర్కొన్నారు.

 
గత ఎన్నికల్లో ఏం జరిగింది.‌ ఏపీ విభజనకు ముందు 2014 మార్చిలో చివరి సారిగా మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలకు కొద్దికాలం ముందుగా ఈ ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 7 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగితే టీడీపీ 5 చోట్ల మేయర్ పీఠాలు కైవసం చేసుకుంది. అందులో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం నగరాలున్నాయి. వైసీపీ రెండు చోట్ల నెల్లూరు, కడప నగర పాలకసంస్థల్లో మేయర్ సీటు ఎక్కింది. మునిసిపల్ , నగర పంచాయతీలు కలిపి 91 స్థానాలకు ఎన్నికలు జరిగితే అప్పట్లో టీడీపీ 69 స్థానాల్లో అధికార పీఠం సాధించింది.

 
వైసీపీ 19 చోట్ల చైర్ పర్సన్ సీట్లు దక్కించుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ పీఠాలపై చైర్ పర్సన్ సీట్లు సాధించారు. వినుకొండ మునిసిపాలిటీలో సీపీఐ చైర్ పర్సన్ స్థానం కైవసం చేసుకుంది. గతంలో విపక్షాలు కొన్ని చోట్ల ప్రభావం చూపినప్పటికీ తాజా ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్షంగా తీర్పు వెలువడడం విశేషం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే కేవలం 29 కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవం కాగా ఈసారి ఏకంగా నాలుగు మునిసిపాలిటీలు మొత్తంగా ఏకగ్రీవం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలింగ్ జరిగిన పట్టణాలు, నగరాల్లో కూడా వైసీపీకే ఓటర్లు పట్టంగట్టారు. మొత్తంగా ఏపీలో వైసీపీ స్థానిక సంస్థల్లో పూర్తిగా పాగా వేయగలిగింది.

 
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కాస్త ఊరట లభించింది విశాఖలోనే. జీవీఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించినప్పటికీ టీడీపీ కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే సీట్లను గెలుచుకుంది. విశాఖలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఉండగా... మొత్తం మూడింటినీ కూడా వైససీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పోరేషన్లో పాగా వేసేందుకు హోరాహోరీగా జరిగిన పోరులో వైసీపీ 58, టీడీపీ 30 స్థానాలు గెలుచుకున్నాయి.

 
కనిపించని కాంగ్రెస్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 13 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 2007లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఈసారి కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకో లేకపోయింది. మరోవైపు బరిలో దిగిన అన్ని పార్టీలు టీడీపీ, వైసీపీ, బిజెపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్ లతో సహా సీట్లూ గెలుచుకున్నారు. వైసీపీ 58, టీడీపీ 30, బిజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1, జనసేన 3 ఇండిపెండెంట్లు 4 సీట్లు గెలుచుకున్నారు.

 
దీంతో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలకు జీవీఎంసీలో స్థానం దక్కినట్టు అయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 67 మంది నామినేషన్ వేసి బరిలో దిగారు. ఒక్కరంటే ఒక్కరు కనీస ప్రభావం చూపు లేకపోవడం గమనార్హం. జీవీఎంసీకి 2007లో ఎన్నికలు జరిగినప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు.

 
విశాఖలో ఏం జరిగింది...
ఈసారి ప్రధానంగా రెండు అంశాల పైనే జీవీఎంసీ ఎన్నికలు జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి విశాఖలోని పరిపాలన రాజధానిగా ప్రకటించడం, మరొకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఓటర్లపై ప్రభావం చూపించిందని చెప్తున్నారు.

 
"ఈ రెండు అంశాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐ, సీపీఎం అభ్యర్థులు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు నగరంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఆ ప్రాంతంలో ఉన్న మెజారిటీ కార్పొరేషన్ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో పరిపాలన రాజధానికి ఓటర్లు ఓకే చెప్పినట్టు అర్థమవుతుంది." అని ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ రవి కుమార్ అన్నారు.

 
బీజేపీ గెలుపు ఆశ్చర్యమే
జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన సంయుక్త అభ్యర్థులు బరిలోకి దిగారు. "జీవీఎంసీ పోలింగ్‌కి కేవలం 48 గంటల ముందు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% జరుగుతుందని కచ్చితంగా చెప్పడంతో బీజేపీకి కనీస స్థాయిలో ఓట్లు రావని భావించాం.

 
కానీ బిజెపి అభ్యర్థి ఒకరు గెలవడం బీజేపీ బలపరిచిన ముగ్గురు జనసేన అభ్యర్థులు విజయం సాధించడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా కొన్ని స్థానాల్లో బీజేపీకి చెప్పుకోతగ్గ స్థాయిలో ఓట్లు కూడా రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ప్రజల నాడిని పట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదని మరోసారి అర్థమవుతుంది." అని ఏయూ జర్నలిజం ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ అన్నారు.

 
ఫలితాలు నిరాశపరిచాయి: విజయసాయిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వైసీపీ తరఫున ఎన్నికల బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చూసుకున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేపట్టారు.

 
"ఈ ఎన్నికలల్లో ప్రజలు చంద్రబాబుకుసరైన బుద్ది చెప్పారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలిపారు. సీఎం జగన్ ప్రచారం చెయ్యలేదు, ఓటూ ఆగడలేదు. అయినా ప్రజలు ఆలోచించి ఓటు వేశారు. చంద్రబాబు రెచ్చగొట్టేల ప్రచారంలో ప్రసంగాలు చేశారు. జీవీఎంసీని వైసిపి కైవసం చేసుకున్నా... ఫలితాలు కొంత మేర నిరాశ పరిచాయి. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలుయజేస్తాం. గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణ నియోజకవర్గాలలో ఎక్కువ స్థానాలు పోగొట్టుకున్నాం. ఓటమి స్థానాలపై సమీక్ష జరుపుతారు. సబ్బం హరి, రఘురామకృష్ణ రాజు మాటలు అసత్య ప్రచారాలని ప్రజలు రుజువు చేశారు. ప్రజలు టీవీలు చూసి ఓటు వెయ్యలేదు. అభివృద్ది, సంక్షేమం చూసి ఓటు వేసారు." అని ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో భారీగా పెరగనున్న ఏసీ ధరలు!