Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ - మహానటి సావిత్రి దేశ‌భ‌క్తి

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష

Advertiesment
Mahanati
, శనివారం, 19 మే 2018 (12:49 IST)
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సావిత్రి జీవితానికి సంబంధించి తెలియని విషయాలెన్నింటినో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ మహానటికి సంబంధించిన అనుభవాలు అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో సావిత్రి దేశభక్తి, దాతృత్వానికి అద్దం పట్టే అద్భుతమైన సంఘటన ఓ నెటిజన్ పంచుకున్నాడు. ఫోటోతో సహా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
అది 1965. భారత్, పాక్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. వరస యుద్ధాలతో భారత్ ఆర్థికంగా చతికిలబడిపోయింది. అదే సమయంలో యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది. దీంతో నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు. 
 
1965 సెప్టంబర్‌లో ఒక రోజు ప్రధాని చాంబర్‌లోకి గుమస్తా వచ్చి ‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ అని చెప్పాడు. శాస్త్రి గారు ఎవరా అని ఆలోచిస్తూనే ‘సరే లోపలికి పంపండి’ అని ఆదేశించారు. 28 ఏళ్ల వయసున్న ఓ యువతి ఒంటి నిండా నగలతో ధగధగలాడుతూ లోపలికి వచ్చి.. ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రిగారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. శాస్త్రి గారు కూడా అభినందనపూర్వకంగా నవ్వారు. తర్వాత ఆ నటి తాను వచ్చిన పని చెబుతూ.. తను ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెట్టారు. 
 
ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదులిచ్చారు. తాళిబొట్టు మాత్రం ఉంచేసుకొని ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ.. ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో.. ‘భేటీ నువ్వు మహనీయురాలివమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు’ అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమెతో కరచాలనం చేసి, గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. ఆమె ఎవరో కాదు.. మన మహానటి, తెలుగింటి ఆడపడచు సావిత్రి గారు. ఆమె చేసిన దానాల్లో ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భరత్ అనే నేను'లోని "ఐ డోంట్ నో" ఫుల్ వీడియో సాంగ్