Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా : అందే బాబయ్య

అందుకే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా : అందే బాబయ్య
, శనివారం, 5 జూన్ 2021 (22:23 IST)
టిఆర్ఎస్ పార్టీలో విలువ లేదు.. గౌరవం లేదు ఇవి లేని చోట తాను పార్టీలో ఇమడలేనని, ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో తనను ఎవరూ పిలువలేదని ఆత్మ గౌరవం లేని చోట ఉండలేనని అందుకే రాజేందరన్న బాటలో  వెళ్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అందే బాబయ్య నిట్టూర్చారు.

టిఆర్ఎస్ పార్టీకి తన రాజీనామాపై మీడియా ముందు స్పష్టత ఇచ్చారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏబి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందే బాబయ్య మాట్లాడారు.

ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ ను అన్యాయంగా పార్టీ నుండి పంపించారని ఇది ముదిరాజులకు ఎంతో అవమానం అని అందుకే ఆత్మగౌరవం కోసం పార్టీ పదవులను త్యాగం చేసి భవిష్యత్ కార్యచరణను నిర్ణయించేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.

గత ఏడేళ్లలో తెరాస పార్టీలో నిబద్ధతతో పని చేశానని చెప్పుకొచ్చారు. అధిష్టానం ఏ భాద్యత అప్పజేప్పినా తన సొంత ఖర్చులతో ఆయా పనులను నెరవేర్చానని పేర్కొన్నారు. కొడంగల్ ఎన్నికల బాధ్యత ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గ బాధ్యతలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో సమర్థవంతంగా పార్టీకి కష్టపడి పనిచేశానని బాబయ్య చెప్పారు.

రాష్ట్రంలో ముదిరాజుల మనోభావాలను అర్థం చేసుకుని కనీసం తనను పార్టీ నుండి వెళ్లొద్దని ఏ ఒక్కరు కూడా సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సమయంలో  కేసీఆర్, కేటీఆర్, ఎంపీ బండ ప్రకాష్ లు పలు సందర్భాల్లో తనతో మాట్లాడారని వారిపై గౌరవంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు ఎన్నికల్లో పని చేయడం జరిగిందన్నారు.

తాను కూడా ఏం ఆశించకుండా పైరవీలు చేయకుండా కాంట్రాక్టులు తీసుకోకుండా సొంత ఖర్చులతో పని చేశానని చెప్పారు. పార్టీ ప్రతిష్ట కోసం ఓ సందర్భంలో తన సుమారు నాలుగెకరాల పొలం అమ్ముకున్నట్లు బాబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రగతి నివేదన సభ కోసం సుమారు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశానని, ఇంకా పార్టీకి సొంత ఖర్చులతో పని చేసినట్టు తెలిపారు.

పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనకు ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆత్మగౌరవం లేనిచోట ఉండలేనని తెలిపారు. గతంలో ఈ విషయాలను అధిష్టానానికి ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 2018లో ఢిల్లీలో కేసీఆర్ ను స్వయంగా కలుసుకుని ఎమ్మెల్యే టికెట్ గురించి అడిగానని అయితే పటాన్ చెరువు, షాద్ నగర్ టికెట్స్ ముదిరాజులకు ఇస్తానని చెప్పిన కేసీఆర్ తర్వాత మోసం చేశారని బాబయ్య పేర్కొన్నారు.

అంతేకాకుండా నామినేటెడ్ పదవిని ఆశించిన తనకు భరోసా ఇచ్చారని ఆ తర్వాత విస్మరించారని అధిష్టానంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ కు జరిగిన అన్యాయం తర్వాత తమకు జరిగిన అవమానాలను నెమరేసుకుని ఇక పార్టీలో ఉండలేమని అసంతృప్తితో టిఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. సమావేశంలో మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలను అడిగారు.

ఆయా ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ టిఆర్ఎస్ పార్టీ నుండి అసంతృప్తిగానే వెళుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా స్థానిక టిఆర్ఎస్ నేతల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీలో చేరుతున్న విషయమై ప్రస్తావించగా అందరితో ఈ విషయమై మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.రాజేందరన్నను నమ్ముకుని ఆయన బాటలో వెళ్తున్నామని ఇక భారమంతా ఆయనదేనని  చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు : మంత్రి ఆదిమూలపు