Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దపల్లిలో న్యాయవాదుల దంపతుల హత్య : సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Advertiesment
Murder Of Lawyer-Couple
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన న్యాయవాదుల హత్యపై హైకోర్టు స్పందించింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్యను ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.
 
లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని వెల్లడించింది. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. నోటీసులు జారీ చేసిన ధర్మాసనం... కేసు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.
 
కాగా, హైకోర్టు లాయర్లుగా పని చేస్తున్న వామనరావు దంపతుల హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన హత్యేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యల వెనుక పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ పుట్ట మధు హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీవర్షిణి మంథనిలోని పుట్ట మధు నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, వామనరావు దంపతుల హత్యలతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 
 
టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేసుకుంటూ పోయిఉంటే ఇన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి కావని అన్నారు. కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శీను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పని చేశాడని చెప్పారు.
 
మరోవైపు న్యాయం తరపున పోరాటం చేస్తున్న లాయర్లకు రక్షణ కల్పించాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లాయర్లకు రక్షణ కల్పించే అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను వెంటనే అమల్లోకి తేవాలని కోరింది. 
 
వామనరావు దంపతులు నిరంతరం న్యాయం కోసం పరితపించేవారని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు. వారి హత్యను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. అలాగే, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో తెరాసను బొంద పెట్టేవరకు నిద్రపోం : ఎంపీ అరవింద్