ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపేలా చూడాలని కొన్నిరోజుల కిందట న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల కొత్తగా ఓటు హక్కు పొందిన 3.6 లక్షల మందికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు.
దాంతో ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... కొత్త ఓటర్ల జాబితాను అందించడంలో ప్రభుత్వం సహకరించలేదని, అందుకే తాము పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని విన్నవించారు.
అంతేకాదు, ఓటర్ల జాబితాపై ఎస్ఈసీదే తుది నిర్ణయం అవుతుందని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2019 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరుగుతాయని పిటిషనర్లకు తేల్చిచెప్పింది.
ఇదిలావుంటే, గురువారం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.