ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల తరపున న్యాయవాది శివప్రసాదరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పంచాయతీ ఎన్నికలను గత 2019 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని భావించడం సరికాదని, 2021 ఎన్నికల జాబితాతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. 2019 నాటి జాబితాతో 3.60 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. అయితే, ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది శివప్రసాదరెడ్డి కోర్టుకు తెలిపారు. దాంతో సానుకూలంగా స్పందించిన హైకోర్టు గురువారం విచారించేందుకు అంగీకరించింది.
ఈ కేసులో పిటిషనరుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపీలో పంచాయతీ పోల్‌కు మరోమారు బ్రేక్ పడే అవకాశం ఉంది. కొత్తగా ఓటర్ల జాబితా తయారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది.
ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీతో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ కూడా హాజరయ్యారు. అలాగే, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ముఖ్యంగా, ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వారిద్దరనీ బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వారి సర్వీసు రికార్డులో అభిశంసనను నమోదు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం.