టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత మహిళా హాకీ జట్టు సెమీస్ పోటీలో ఓడిపోయింది. బుధవారం జరిగిన ఈ పోటీలో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్రీడల్లో అసాధారణ పోరాటంతో భారత మహిళా హాకీ జట్టు తొలిసారి సెమీస్ వరకు చేరింది. కానీ, ఫైనల్ చేరలేకపోయింది.
సెమీస్‌లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియన్ టీమ్‌కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ తర్వాత మరో గోల్ సాధించలేకపోయారు.
కానీ, అర్జెంటీనా తరపున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు.
ఫలితంగా సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో భారత మహిళా జట్టు పోరాడి ఓడిపోయింది. దీంతో ఇక కాంస్యం కోసం కోసం బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.