Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిల్వర్ ఖాయం.. రెజ్లర్ రవి కుమార్ దహియా రికార్డ్.. జర్నీ సంగతులు

Advertiesment
Tokyo Olympics
, బుధవారం, 4 ఆగస్టు 2021 (16:25 IST)
Ravi Kumar Dahiya
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. వరుసగా విజయాలు సాధిస్తున్న అతడు.. తాజాగా ఫైనల్ చేరాడు. బుధవారం జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై అతడు గెలిచాడు. ఫైనల్ లో గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ వస్తుంది. అంటే భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరనుంది. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వర్‌దత్‌లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు.
 
ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ చేరి దేశానికి కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేశాడు. తద్వారా టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందాడు. 
 
సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
 
ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్‌ నిలవనున్నాడు. ఇంతకముందు సుశీల్‌ కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌లు రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే యోగేశ్వర్‌ దత్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్‌ కుమార్‌ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్‌ దహియా నిలిచాడు.
 
రవికుమార్ ప్రస్థానం 
రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. దేశంలోని టాప్ రెజ్లర్లయిన యోగేశ్వర్ దత్‌, ఫోగాట్ అక్కచెళ్లెల్లు, భజరంగ్ పూనియాలాంటి వాళ్లదీ ఈ హర్యానానే. అక్కడి గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై మోజు పుడుతుందేమో. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు చూశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు.
 
ఢిల్లీలోని ఛత్రసాల్‌లో శిక్షణ పొందే రెజ్లర్లలో 20 శాతం మంది రవికుమార్ దహియా ఊరి వాళ్లే ఉన్నారంటే అక్కడి వాళ్లకు రెజ్లింగ్‌పై ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
 
2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ అతడు సిల్వర్ మెడల్ గెలిచాడు. 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు. 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌కు పీవీ సింధు : శంషాబాద్‌లో ఘన స్వాగతం