హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచారి అని తనకు తెలియదని, తాను పాకిస్థాన్‌కు కేవలం విహారయాత్రకు మాత్రమే వెళ్లానని ఒరిస్సా రాష్ట్రంలోని పూరీకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతి స్పష్టం చేశారు. హర్యానా, హిస్సార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రాతో ప్రియాంకకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. అదేసమయంలో మూడు నెలల క్రితం ప్రియాంక పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె శత్రుదేశానికి ఎందుకు వెళ్లారు. అక్కడ ఏం చేశారు., ఎవరెవరిని కలిశారు అన్న అంశాలు కీలకంగా మారాయి.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక సేనాపతి ఆదివారం వివరణ ఇచ్చారు. "జ్యోతి మల్హోత్రా పాక్ గూఢచారిణి అని నాకు తెలియదు. పూరీ వచ్చిన ఆమెను స్నేహితురాలిగా భావించి కలిసిమెలిసి తిరిగా. నేను పాకిస్థాన్‌కు విహారయాత్రకు కోసం వెళ్లా. అంతకుమించి ఏమీ లేదు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా" అని పేర్కొన్నారు.
అలాగే, ప్రియాంకా తండ్రి రాజ్‌కిశోర్ సేనాపతి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హిస్సార్ ఎస్పీ వినీత్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇపుడే చెప్పలేమన్నారు. దర్యాప్తు కొలిక్కి వచ్చేవరకు ప్రియాంకను పూరీ విడిచి వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను విశ్లేషిస్తున్నట్టు ఆయన తెలిపారు.