లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్‌లో గుర్తుతెలియని దుండగులు లష్కరే తోయిబా టాప్ కమాండర్ రజౌల్లా నిజామాని అలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్‌ను హతమార్చారు. సింధ్ ప్రావిన్స్‌లోని మట్లీ నగరంలోని ఫాల్కారా చౌక్ సమీపంలో అతన్ని చంపినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు.
ఖలీద్ తన ఇంటి నుండి బయటకు రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఖలీద్ అక్కడికక్కడే చనిపోయాడు. అబూ సైఫుల్లా ఖలీద్ మలన్ ప్రాంత నివాసి, అతను చాలా కాలంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని అధికారులు తెలిపారు.
భారత్‌లోని నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఫేక్ ఐడీతో నేపాల్‌లో తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్..ఇటీవలే సింధ్ ప్రావిన్స్‌కు మకాం మార్చాడు. పహల్గామ్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సైఫుల్లా సహకరించినట్టు గుర్తించారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత.. సైఫుల్లా ఖలీద్‌కు భద్రత కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం.. ఈ క్రమంలో అతన్ని కొందరు కాల్చి చంపడం కలకలం రేపింది.