దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కరోనా విలయ తాండవంపై స్పందించారు.
కరోనా వైరస్ మన సహనాన్ని, నొప్పిని భరించే శక్తిని పరీక్షిస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మన ప్రియ బాంధవులెందరో మనల్ని విడిచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మొదటి వేవ్‌ను విజయవంతంగా అణిచివేసిన తర్వాత జాతి స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగాయని, కానీ తుఫానుల విజృంభించిన సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మహమ్మారిని అరికట్టడం కోసం తాను ఫార్మా పరిశ్రమ, ఆక్సిజన్ ఉత్పత్తి రంగాలకు చెందిన పలువురు నిపుణులు సమావేశమై చర్చించానని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మన హెల్త్‌కేర్ సిబ్బంది, డాక్టర్లు కరోనా మహమ్మారి ప్రధాన యుద్ధం చేస్తున్నారన్నారు.
అయితే, కరోనా మహమ్మారికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు అస్సలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. నమ్మకమైన ప్రసార మాధ్యమాల నుంచి మాత్రమే ప్రజలు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు.
చాలా మంది వైద్యులు కూడా సోషల్ మీడియాలో కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారని, కోరినవారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రాలు చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. కానీ, ప్రధాని మోడీ తన ప్రసంగంలో దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై ప్రస్తావించక పోవడం గమనార్హం.