మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారిపోతోంది. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిలిచింది. దీంతో ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను మహారాష్ట్ర ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓ కరోనా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు.
రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ దవాఖానలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దవాఖానలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది సజీవ దహణమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దవాఖానలోని రోగులను సమీపంలోని హాస్పిటళ్లకు తరలించారు. ఫైర్ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్నట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.