భారత్‌లో కరోనా సునామీ కొనసాగుతోంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుంటే, ముడిచమురు ధరలు మాత్రం నానాటికీ పతనమైపోతున్నాయి. కానీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
నిజానికి ప్రపంచంలో ముడి చమురు దిగుమతులతో ఇండియాది మూడోస్థానం. దీంతో భారత్‌లో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆయిల్‌కు డిమాండ్ తగ్గిపోతోంది. మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా.. బుధవారం మరో 48 సెంట్లు పతనమైంది.
ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 66.09 డాలర్లుగా ఉంది. అతి పెద్ద ముడిచమురు వినియోగదారుల్లో ఇండియా కూడా ఒకటని, ఇక్కడ కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఆయిల్ డిమాండ్‌ను తగ్గిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర రావ్ అన్నారు.
ఇప్పటికే ఓపెక్, దాని మిత్ర దేశాలు ఆయిల్ ఉత్పత్తిని భారీగా పెంచాయని, రానున్న రోజుల్లో అందుకు తగినట్లు డిమాండ్ ఏర్పడకపోతే ధరలు మరింత పతనమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించారు. దీని ప్రభావం ముడి చమురు వినియోగంపైనా పడింది. డిమాండ్ తగ్గడంతో రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించాయని గుర్తుచేస్తున్నారు.