రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కంపెనీ యజమాని ఐదు నెలలుగా వేతనం ఇవ్వడంలేదు. దీంతో ఆ ఉద్యోగికి బతుకు భారమైంది. అందువల్ల తనకు వేతనం ఇవ్వాలని యజమానివద్ద మొరపెట్టుకున్నాడు. కానీ, ఆ యజమాని మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో శాంతించని ఆయన.. వేతనం అడిగిన ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ నగరంలోని ఖైర్ థాల్ ప్రాంతంలో ఓ వ్యక్తికి మద్యం షాపు ఉంది. ఇందులో కమల్ కిషోర్ (22) అనే వ్యక్తి సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కరోనా లాక్డౌన్ కారణం చూపి.. ఐదు నెలలు పనిచేసినా యజమాని జీతం ఇవ్వలేదు. దీంతో తనకు వేతనం ఇవ్వాలని యజమానిని కమలేశ్ నిలదీశాడు.
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మద్యం దుకాణ యజమాని... కమల్ కిషోర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శరీరానికి మంటలు అంటుకోవడంతో తనను తాను రక్షించుకునేందుకు కమల్ కిషోర్ దుకాణంలో ఉన్న డీప్ ఫ్రీజర్‌లోకి వెళ్లాడు. అప్పటికే శరీరంలో అధికభాగం కాలిపోవడంతో కిషోర్ కిషోర్ మృతి చెందాడు.
కాగా, కమల్ కిషోర్ దళితుడు కావడంతో ఈ ఘటనపై రాజస్థాన్ దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.